ఎన్నో జోనర్లు. ఎన్నో కథలు. ఎప్పటికప్పుడు కొత్త జోనర్లు వస్తుంటాయి. పాత కథలు బోరు కొడుతుంటాయి. అయితే, కామెడీకి ఉండే గిరాకీనే వేరు. కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు. `ఇంకోసారి నవ్విస్తాం..` అని చెప్పి, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమా తీస్తే చాలు. ఆదరణ దక్కడం ఖాయం.అయితే, ఈమధ్య పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలు రావడం లేదు. టాప్ హీరోలు ఈ జోనర్లకు ఎప్పుడో దూరమైపోయారు. కామెడీలు తీసే సామర్థ్యం ఉన్న దర్శకులూ కరువయ్యారు. కొద్దో గొప్పో అనిల్ రావిపూడి అలాంటి సినిమాలు అందిస్తూ వస్తున్నారు.`ఎఫ్-2`తో ఆ దర్శకుడు చేసిన మ్యాజిక్ మనకు తెలిసిందే. ఇంటిల్లిపాదినీ కట్టిపడేసిన ఆ సినిమా అందరూ హాయిగా నవ్వుకునేలా చేసింది.
ఆ ఉత్సాహంతోనే, ఆ సినిమా ఇచ్చిన భరోసాతోనే `ఎఫ్ 3` వచ్చింది. వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘బ్రొమాన్స్’, రావిపూడి డైరెక్షన్, తమన్నా, మెహరీన్‌ల గ్లామర్.. అన్నీ `ఎఫ్ 3`కి ఎలాంటి విజయాన్ని కట్టబెట్టాయి? ఎఫ్ 2తో పోలిస్తే.. ఈ సీక్వెల్ ఏ స్థాయిలో ఉంది..తెలుసుకుందాం?
డబ్బు.. డబ్బు. డబ్బు..
వెంకీ (వెంకటేష్)కి ఇంట్లో అన్నీ కష్టాలే. సవతి తల్లి పోరు ఓ వైపు, అక్క బాధ్యతలు మరో వైపు. ఆర్టీవో ఆఫీసులో బ్రోకర్‌గా పనిచేస్తున్నా.. బోలెడన్ని కోరికలు. అయితే చాలీ చాలని జీతం. ఎలాగైనా డబ్బు సంపాదించాలని, కోట్లకు పడగలెత్తేయాలని కలలు కంటుంటాడు. `మంగ ఫ్యామిలీ` దొంగ దెబ్బ తీయడంతో లక్షలు లక్షలు పోగొట్టుకుంటాడు.
మరోవైపు వరుణ్ (వరుణ్ తేజ్)దీ డబ్బు గొడవే. చిన్న చిన్న సెటిల్మెంట్లు, దందాలతో డబ్బులు రాబట్టాలని చూసి భంగపడుతుంటాడు. ఓ గొప్పింటి అమ్మాయిని చూసి, పడగొట్టేస్తే… ఈజీగా కోటీశ్వరుడు అయిపోవాలని స్కెచ్ వేస్తాడు. అది కూడా దారుణంగా బెడసికొడుతుంది.మరోవైపు నాగరాజు (రాజేంద్ర ప్రసాద్) నిజాయతీ గల పోలీస్ అధికారి. కానీ నిజాయితీ వల్ల ఏం సంపాదించలేం అనే సంగతి తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో వెంకీ, వరుణ్, మంగ ఫ్యామిలీతో కలిసి.. ఓ రాబరీ ప్లాన్ చేసి కోట్లు కొల్లగొడతాడు. కానీ… అక్కడ కూడా ప్లాన్ రివర్స్ అవుతుంది.
చివరికి… వీళ్లంతా కలిసి ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) అనే అపర కుబేరుడి ఇంటికి చేరకుంటారు. హైదరాబాద్‌లోని వీళ్లకు, విజయ నగరంలోని ఆనంద్ ప్రసాద్‌కీ ఉన్న లింకేమిటి? డబ్బు వేటలో వీళ్లంతా చివరకు ఎక్కడికి చేరుకున్నారు? అనేదే మిగిలిన కథ.
సరదా.. సరదాగా..
`ఎఫ్ 2`లో దర్శకుడు నమ్మింది వినోదాన్ని మాత్రమే. ఆ సినిమాలో లాజిక్కుల్ని అస్సలు పట్టించుకోలేదు. ఈసారీ అంతే.
ఏ కామెడీ సినిమా అయినా, లాజిక్కుల జోలికి వెళ్తే నిలబడదు. ఎఫ్ 3 అస్సలు నిలబడదు. ఈ కథలో ఎలాంటి లాజిక్ ఉండదు. కేవలం మ్యాజిక్ మాత్రమే ఉంటుంది.
ఈ కథను చెప్పడానికి వెంకీ, వరుణ్‌లను టూల్స్‌గా వాడుకున్నారు. వాళ్లిద్దరికీ మంచి ఇమేజ్ ఉంది. క్రేజ్ ఉంది. వాళ్లకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ.. అవేం పట్టించుకోకుండా, కేవలం `ఫన్` కోసమే ఆయా పాత్రల్ని చేసుకుంటూ వెళ్లారు ఇద్దరు హీరోలు.వెంకీ `రేచీకటి`, వరుణ్ `నత్తి`కీ ఈ కథకూ ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకు ఆ బలహీనతలు లేకపోయినా అదే కథ, అది అలాగే నడుస్తుంది. వాటిని అవసరానికి తగ్గట్టు వాడుకుంటూ వెళ్లాడు దర్శకుడు. అవి అన్ని సందర్భాల్లోనూ వర్కవుట్ అవుతూ వెళ్లాయి.
కథ మరీ రొటీన్ గురూ..!
ఎఫ్3 కథ కోసం దర్శకుడు ఏమాత్రం కొత్తగా ఆలోచించలేదు. వరుణ్ – మెహరీన్‌ల లవ్ ట్రాక్, రాబరీ కథ, కోట్లాస్తి కోసం వారసుడి డ్రామా.. ఇవన్నీ పార్టు పార్టులుగా చాలా సినిమాల్లో చూశాం.
కాకపోతే.. ఒక్కో ట్రాకుతో ఒక్కో సినిమా తయారైపోయింది. ఆ మూడింటినీ ఒకే చోట చేర్చి ఎఫ్ 3 కథ అల్లేశాడు అనిల్ రావిపూడి.
కాకపోతే… ఇంత రొటీన్ కథలో దర్శకుడు నమ్ముకొంది వినోదాన్ని మాత్రమే. `సవతి తల్లి` డైలాగులతో, మనీ ఫ్లాంట్ వంటలతో వెంకీ ఇంట్లోంచే నవ్వులాట మొదలెట్టేశాడు దర్శకుడు.
`మంగ చైనీస్ రెస్టారెంట్` ట్రాక్ పెద్దగా నప్పలేదు. గుండు సుదర్శన్ `గుండు కమల్ హాసన్`గా మారిపోవడం లాంటివి ఫక్తు ఈవీవీ మార్కు సన్నివేశం. ఆయా సన్నివేశాల్లో సునీల్ మేనరిజం.. ఆకట్టుకుంది. దాంతో కొన్ని రొటీన్ సన్నివేశాలు సైతం పండేశాయి.
లిబర్టీ మరీ ఎక్కువైంది!
ఆనంద్ ప్రసాద్ ఇంట్లో వారసుడి డ్రామాతో సెకండాఫ్ మొదలవుతుంది. వెంకీ, వరుణ్, తమన్నా, వెన్నెల కిషోర్… రంగంలోకి దిగడంతో మరో డ్రామా స్టార్ట్.
ఇది కూడా పాత సినిమాల ట్రాకే. కాబట్టి… అవేం పెద్దగా ఆసక్తి కలిగించవు. తమన్నాకు మీసాలు పెట్టి, మగరాయుడిలా మార్చాలన్న ఐడియా దర్శకుడికి ఎందుకొచ్చిందో? ఈ విషయంలో రావిపూడి కాస్త లిబర్టీ ఎక్కువ తీసుకొన్నాడనిపిస్తుంది.
వారసులకు పరీక్ష పెట్టడం.. బుల్ ఫైట్, వాతల కార్యక్రమం.. ఇవన్నీ `సాగదీత` ధోరణిలో సాగే సన్నివేశాలే. డాల్ ఫ్యాక్టరీని ఉద్ధరించడానికి ఈ గ్యాంగ్ అంతా.. కష్టపడడం, అందులో అద్భుతాలు సాధించడం… సినిమాటిక్ గా అనిపిస్తుంది.
క్లైమాక్స్ లో మళ్లీ దర్శకుడు ఫన్ సృష్టించాడు. పాన్ ఇండియా క్లైమాక్స్, ఓటీటీల ఫార్ములాతో నవ్వులు పంచాడు. అక్కడ ఆయా హీరోల అభిమానులకు ఎక్స్ ట్రా ఫన్ అందుతుంది. క్లైమాక్స్ వర్కవుట్ అవ్వడంతో అప్పటి వరకూ సాగిన లాగ్‌ని సైతం ప్రేక్షకులు మర్చిపోతారు.
మధ్యలో పూజా హెగ్డే పాట… మాస్‌కి ఊపు తీసుకొస్తుంది.
తలా కొంత.., అదే కొలత
ఇదో మల్టీస్టారర్ సినిమా. ఇద్దరు హీరోలు ఉండడంతో ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరిది తక్కువ? అనే కొలతలు మొదలైపోతాయి.
కానీ.. ఎఫ్ 3లో ఆ గొడవ ఉండదు. ఎవరొచ్చినా సరే, ఫన్ కోసమే అనే సరికి.. తెరపై ఎవరు కనిపించినా కామెడీ వర్కవుట్ అయ్యేసరికి ఆ తేడా కనిపించదు.
వెంకటేష్.. తన ఇమేజ్‌ని మర్చిపోయి ఈ సినిమాలో నటించడం.. ఆహ్వానించదగిన పరిణామం. వరుణ్ కామెడీ టైమింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది.
వీళ్లతో పోలిస్తే తమన్నా పాత్ర పరిధి తగ్గిందేమో అనిపించింది. మెహరీన్.. ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ వరకూ ఓకే అనిపించింది. అయితే.. తను మరీ పీలగా తయారవ్వడంతో గ్లామర్ మాయమైంది.
మురళీ శర్మ తనదైన నటన ప్రదర్శించారు. ఒకప్పటి సునీల్‌నీ, తన మేనరిజాన్ని.. ఈ సినిమాలో చూడొచ్చు. పాన్ ఇండియా జూ.ఆర్టిస్టుగా వెన్నెల కిషోర్ నవ్వించగలిగాడు. ఆడవాళ్లపై అమితమైన గౌరవాన్ని ప్రదర్శించే… అలీ కూడా ఓకే అనిపిస్తాడు.
గుప్త నిధుల వేటలో ‘మూత్రం తాగి ప్రాణాలు దక్కించుకున్నా’ : ప్రెస్ రివ్యూ
ఇలాంటి సాధారణమైన కథ కూడా.. టైమ్ పాస్ సినిమాగా, చూడదగిన సినిమాగా రూపొందిందంటే దానికి కారణం.. అనిల్ రావిపూడిలోని రచయితే.
ప్రతీ సీన్లోనూ తనదైన డైలాగ్ ఒక్కటైనా పడింది. పండింది. చాలా చిన్న చిన్న డైలాగులే చాలా సార్లు వర్కవుట్ అయ్యాయి.
ఎక్కడా అశ్లీలత, అసభ్యతా, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా జాగ్రత్త పడడం వల్ల కుటుంబ ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. డబ్బు గురించి చెప్పే పాట బాగుంది. అది తప్ప.. ప్రత్యేకంగా ఏ పాటా గుర్తుండదు. మొత్తంగా చూస్తే.. ఎఫ్ 3 పూర్తి కాలక్షేప చిత్రం. ఎఫ్ 2తో పోల్చి చూడకూడదు.
కానీ… ఈ వేసవిలో కుటుంబం అంతా కలిసి చూసి, కాసేపు నవ్వుకొని, రిలీఫ్‌గా థియేటర్ల నుంచి బయట పడొచ్చు. వెంకీ, వరుణ్‌ల కామెడీ, రావిపూడి పెన్ పనితనం, సునీల్ మేనరిజం.. అన్నీ బాగా వర్కవుట్ అవ్వడంతో.. చాలా మైనస్‌లు కొట్టుకెళ్లిపోయాయి.