గద్దలకొండ గణేష్ రివ్యూ..

132
#GaddhalakondaGanesh (#valmiki )

మనుషులు చాలా డబ్బు సంపాదిస్తారు.. కానీ నేను చాలా భయం సంపాదించాను. ఈ ఒక్క డైలాగ్‌తో కారక్టర్‌నీ సినిమానీ నడిపించేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘వాల్మీకి’ టైటిల్‌తో మొదలై, ‘గద్దలకొండ గణేశ్’‌‌గా మారి విడుదలైన వరుణ్ తేజ్ మూవీ, జిగర్తాండ అనే తమిళ సినిమా రీమేక్.

కథ విషయానికొస్తే.. సినిమాని విపరీతంగా ప్రేమించే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జీవితంలోనుండి కథను వెతుక్కోడం కోసం ప్రయాణం ప్రారంభించి, గద్దలకొండ గణేష్ అనే ఓ దాదా దగ్గరకు చేరతాడు. అతని జీవితం నేపధ్యంలో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే.. ఈ ప్రయాణంలో సీరియస్‌గా మొదలైన అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ క్రమంగా కమెడియన్ రేంజ్‌కి పడిపోతూ ఉండడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే అయినా ఫైనల్‌గా నిలబెట్టాడు. ఆ పాత్ర మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. గుడి ముందు పూలమ్ముకుని జీవిస్తూ కొడుకును చదివించుకుంటూ ఉంటుందో తల్లి. ఇల్లు గడవక కొడుకును ఏదైనా పనిలో పెట్టాలనుకుంటుంది. బారులో అయితే ఎక్కువ డబ్బులొస్తాయని అక్కడ చేరతాడు కొడుకు.. అలా మొదలై రౌడీగా రూపాంతరం చెంది పొలిటికల్ లీడర్స్ చేతుల్లో వెపన్‌గా మారడం.. ఈ క్రమంలో రెండు సార్లు ప్రేమలో విఫలమవడం.. ఇదీ కథ.

ఫస్టాఫ్ అంతా విస్తృతంగా హత్యలు జరుగుతాయి. సెకండాఫ్ కాస్త డ్రామా నడిపే ప్రయత్నం జరుగుతుంది. ఇలా సినిమాను నిలబెట్టేందుకు డైరెక్టర్ కష్టపడ్డాడు. గెటప్పులు.. కొన్ని సీన్లు ఆధారంగా సినిమాను నడిపించే ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టిన చాలా మంది దర్శకులు గుర్తొస్తారు. వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని నటించాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ చేయాలనే తపనతో పనిచేశాడు. కానీ సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్‌తో ఆడియన్స్ బయటకు వస్తారు.

రీమేక్‌లా కాకుండా కాస్త ఒరిజినల్‌గా వెళ్లే ప్రయత్నం చేశాడు హరీష్ శంకర్. ఆ ప్రయత్నంలో కొన్ని తడబాట్లు తప్పలేదు. అన్ని సార్లూ గబ్బర్ సింగ్ మ్యాజిక్ వర్కౌట్ కాదు. దీన్ని ఆయన మనసుకు ఎక్కించుకోవాలి. ఈ ఏరియాలో జరిగిన పొరపాటే సెకండాఫ్ మీద చూపించింది. సీరియస్‌గా నడవాల్సిన సెకండాఫ్ చాలా సందర్భాల్లో డ్రై అయిపోవడం.. అధర్వ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ డల్ అయిపోవడం.. అధర్వ, మృణాళినిల మధ్య ప్రేమ సన్నివేశాలు సరిగా ఎలివేట్ కాకపోవడం.. అధర్వ ఆ ప్రేమలో సీరియస్‌గా ఉన్నాడని ప్రేక్షకులకు అనిపించకపోవడం ఇలా అనేక లోపాల కారణంగా సెకండాఫ్ నీరసంగా నడిచిపోతుంది.

మధ్యలో వచ్చే గణేష్ లవ్ ట్రాక్.. అందులో పూజా హెగ్డే కుటుంబ కథ, ముఖ్యంగా పాత రోజుల్లో యాంటీనాలతో టీవీ ప్రేక్షకులు పడ్డ తిప్పలూ అవన్నీ ఆడియన్స్‌కు రిలీఫ్ ఇచ్చాయి. లేకపోతే సినిమా గ్రాఫ్ మరింత పడిపోయేది. అలాగే తల్లీ కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాను పండించడంలోనూ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఆ ట్రాక్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా రేంజ్ మారి ఉండేది. అలాగే పూజాహెగ్డేను వదిలేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

గద్దలకొండ గణేష్ జస్ట్ గెటప్పుల మీద నడిచే సినిమా. రౌడీయిజం నేపధ్యంలో కామెడీ వండడం పండించడం అనే తనకు తెలిసిన విద్యను కూడా ప్రయోగించడానికి హరీష్ శంకర్ శతవిధాల ప్రయత్నించాడు. సినిమా నిడివి కూడా ఇంకాస్త తగ్గించుకుని ఉంటే బాగుండేది. నటీనటుల పెర్ఫార్మెన్స్, గెటప్స్ లేకపోతే సినిమా ఏమైపోయేదో చెప్పడం కష్టం. గద్దలకొండ గణేష్ సినిమా ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందినా ఆ క్రెడిట్ మొత్తం టీమ్‌దే తప్ప కేవలం దర్శకుడిది అయితే మాత్రం కాదు.

పాటల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ పాట రీమిక్స్ అంత ఎట్రాక్టివ్‌గా లేదు. ముఖ్యంగా టేకింగ్ మీద శ్రద్ధ పెట్టలేదనే విషయం అర్దమవుతూనే వచ్చింది. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. బోస్ కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. నటుడుగా వరుణ్ తేజ్‌కు ఇది అవసరమైన సినిమానే. హరీష్ శంకర్ తన తొలి చిత్రం షాక్ నుంచీ ఓ కంప్లీట్ మూవీ చేయడంలో ఎందుకో తడబడుతున్నాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆ కష్టం నుండి అతన్ని బయట వేసిందనిపించింది. కానీ అతను బయటపడలేదని గద్దలకొండ గణేష్ మరో సారి చెప్పాడు.

ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
ఆకట్టుకున్న గెటప్పులు
డైలాగ్స్

మైనస్ పాయింట్స్:
నిడివి కాస్త ఎక్కువ కావడం
ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్
కథ ముందే తెల్సిపోవడం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here