హైదరాబాద్ లోని నాచారంలో విషాదం నెలకొంది. నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు వెళ్లిన 12 మంది యాత్రికులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఓ లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సులోని 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారు బస్సులోనే చిక్కుకున్నారు. మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో సిమెంట్ లోడ్‌తో ఓ లారీ రాంగ్ రూట్ లో హైవేపైకి వచ్చింది. దీంతో వేగంగా వస్తున్న యాత్రికుల మినీ బస్సు సిమెంట్ లారీని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలికి చేరుకున్న జబల్ పూర్ పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన మినీ బస్సు (ఏపీ 29 డబ్ల్యూ1525) ఏపీలో రిజిస్ట్రేషన్ కావడంతో ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ వాసులని తొలుత భావించారు. అయితే, ప్రమాద స్థలంలో దొరికిన ఆధారాలను పరిశీలించగా.. చనిపోయిన వారంతా హైదరాబాద్ లోని నాచారం వాసులని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.