అమరావతి రాజధాని విషయంలో విమర్శకుల నోళ్లకు తాళం వేసేలా చంద్రబాబు ప్రభుత్వం సంచలన దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. అమలు చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఇది సహజం. యంత్రాంగంలో కదలిక, నిర్ణయాల తీరు వంటివి ఆధారంగా సదరు కార్యాచరణ ఉంటుంది. అయితే.. అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణా నికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను 24 గంటలు కూడా గడవకముందే.. అమలులోకి వచ్చాయి. మంగళవారం రాష్ట్ర మంత్రి వర్గం.. అమరావతి నిర్మాణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రి వర్గం.. ఐకానిక్ టవర్లను నిర్మించేందుకు ఆమోద ముద్ర వేసింది.
అంతే.. తెల్లవారేసరికి అంటే.. బుధవారానికి అధికారులు కార్యాచరణ ప్రకటించారు. కీలకమైన సచివాలయం, హైకోర్టు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) టెండర్లను పిలిచింది. సచివాలయానికి 4 టవర్లు, ఉన్నతాధికారుల(హెచ్‌వోడీ) కార్యాలయానికి ఒక టవర్ కు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. వీటిలో పాల్గొనే వారు.. సంబంధిత నిబంధనలకు లోబడి వ్యవహరించాలని పేర్కొంది. ఈ రెండు టెండర్ల సీల్డ్ బిడ్లను కూడా.. వచ్చే నెల 1న తెరవనున్నారు.
ఏయే టవర్‌కు ఎంతెంత ఖర్చు..
+ హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లు
+ సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు.
+ సచివాలయం 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లు.
+ మొత్తంగా 5 టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్లను ఖర్చు చేయనున్నారు.
ఎన్నెన్ని అంతస్థులు?
నిర్మించబోయే ఐకానిక్ టవర్లకు ముందుగానే అనుకున్న ప్రకారం.. అంస్థులను కూడా నిర్ణయించారు. దీని ప్రకారం.. ఉన్నతాధికారులు ఉండే హెచ్‌వోడీ టవర్‌ను 45 అంతస్థులతో నిర్మిస్తారు. సచివాలయానికి సంబంధించిన 4 టవర్లను ఒక్కొక్కటీ 40 అంతస్థులతో నిర్మిస్తారు. వీటి నిర్మాణానికి రెండున్నరేళ్ల గడువు విధించారు. అత్యధికంగా మరో ఆరు మాసాలు పొడిగించే వెసులుబాటు ఉంది.