పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జులై 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై విధంగా స్పందించారు. పహల్గాంలో దాడి జరిగినప్పటికీ.. కాశ్మీర్‌లో పర్యాటకం తిరిగి త్వరలో ప్రారంభమవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు అడ్డుకొలేరని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థానీ జాతీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని.. వారు భారత్ విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు.పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. దేశం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించదన్నారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటంపై భారతదేశానికి ఆసక్తి లేదని తెలిపారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.పాకిస్థాన్ ఉగ్రదాడులతో భారత్‌కు సవాలు విసురుతోందని.. ఈ నేపథ్యంలో ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోంటుందన్నారు. పాకిస్థాన్ వంటి ఉగ్రవాద దేశంతో వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మరి ముఖ్యంగా వీసా రద్దులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను త్వరలో తెలియజేస్తామని చెప్పారు.
ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు. అలాగే ఉగ్రవాదుల మద్దతుదారులను గుర్తించి.. వారిని పట్టుకొని శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై తనతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు.గతంలో 26/11 ముంబై ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నామని.. అలాగే పుల్వామా దాడులకు సైతం తాము తగిన సమాధానం ఇచ్చామని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.ఈ ఏడాది అమర్‌నాధ్ యాత్రకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జులై 3వ తేదీన ఈ అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల నుండి ఒకే సారి ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి.. అలాగే గందేర్‌బాల్ జిల్లాలోని బాల్తాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభకానుంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది మరణించారు. అంతకుముందు అంటే.. 2019 పుల్వామాలో దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం విధితమే.