ఆంధ్రప్రదేశ్ సర్కార్ మద్యం ప్రయులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్ అనే మూడు విభాగాల్లో మద్యం సరఫరా కానుంది. అయితే, రూ.99 మద్యం, బీరుపై ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది.
గత కొంతకాలంగా మద్యం షాపులు నడిపే వ్యాపారులు తమకు తక్కువ మార్జిన్ రావడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడంతో.. ప్రభుత్వం 14.5% నుంచి 20% వరకు మార్జిన్ పెంచేందుకు అంగీకరించింది. అయితే, ఈ మార్పుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. దీంతో అన్ని కేటగిరీల మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో క్వార్టర్ రూ.99కు విక్రయిస్తున్న మినహా మిగిలిన అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు క్వార్టర్, హాఫ్, ఫుల్‌లపై ఉన్న ఎమ్మార్పీకి అదనంగా రూ.10 చొప్పున ధర పెరగనుంది. అయితే ప్రభుత్వం బీర్ల ధరల్ని మాత్రం పెంచలేదు.. ఆ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలకు సంబంధించి అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని (ఏఆర్‌ఈటీ) సవరించారు. మద్యం షాపుల లైసెన్సుదారులకు రిటైలర్ మార్జిన్‌ను ఇష్యూ ప్రైస్‌పై 14 శాతం చెల్లించేందుకు వీలుగా ఈ సవరణలు చేసింది ఎక్సైజ్ శాఖ.
మరోవైపు రాష్ట్రంలో మద్యం ధరలపై తప్పుడు ప్రచారం సరికాదన్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్. రాష్ట్రంలో మద్యం ధరలు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ తప్పుడు ప్రచారం సరికాదని.. క్వార్టర్ రూ.99 బ్రాండ్లు, బీర్ల ధరలు పెంచలేదని తెలిపారు. మిగతా వాటికి సంబంధించి వాటి బ్రాండ్, పరిమాణంతో సంబంధం లేకుండా అన్ని బాటిళ్లపై రూ.10 మాత్రమే పెరిగిందని గమనించాలన్నారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని యజమానుల్ని ఆదేశించామన్నారు.
చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇప్పుడు ధరల పెంచాల్సి వచ్చిందంటున్నారు. రాష్ట్రంలో అక్టోబరులో కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన సమయంలో పన్నులు సవరించిన సంగతి తెలిసిందే. కొత్త పాలసీని తీసుకొచ్చే సమయంలో అంచనాల రూపకల్పనలో పొరపాట్లు జరిగాయి. దీనిని గమనించకపోవడంతో పాలసీ అమల్లోకి వచ్చాక అంచనాల్లో పొరపాట్లు బయటపడ్డాయి అంటున్నారు. తాజాగా ఆ పొరపాటును గుర్తించి ఇటీవల మార్జిన్ పెంచారు.. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్జిన్ సవరణ కోసం వినియోగదారులపై స్వల్పంగా అదనపు భారం తప్పలేదు అంటున్నారు. వాస్తవానికి ఎక్సైజ్ పాలసీ సమయంలో 20శాతం మార్జిన్ వచ్చేలా చూస్తామన్నారు.. అయితే 10శాతం మాత్రమే ఉందని షాపులు దక్కించుకున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 10ని 14శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.