బాలీవుడ్ రొమాంటిక్ హీరో రాజేశ్ ఖన్నా.. తను లేకుండా ఉండేవాడు కాదని అంటున్నది సీనియర్ నటి అనితా అద్వానీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ మొదటి పరిచయం గురించి, తర్వాత వారి అనుబంధం గురించీ చెప్పుకొచ్చింది. ఇన్నేళ్లలో వారి బంధం ఎలా బలపడిందో వెల్లడించింది. అనిత టీనేజీలో ఉన్నప్పుడు ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లిందట. అక్కడే రాజేశ్ ఖన్నాను మొదటిసారిగా చూసినట్లు చెప్పుకొచ్చింది. “అప్పటికే అతనో సూపర్‌స్టార్.
అంత పెద్ద నటుణ్ని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. ఆ క్షణంలోనే ఆయన రూపం నా మనసులో శాశ్వతంగా ముద్రపడిపోయింది. ఆ సందర్భం ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నది. తెలిసినవాళ్లతో కలిసి రాజేశ్ ఇంటికి వెళ్లిమరీ అతణ్ని కలిసిందట. కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగిందనీ, కొన్నేళ్లపాటు రాజేశ్‌తో డేటింగ్ చేశాననీ చెప్పుకొచ్చింది.
“రాజేశ్ ఎప్పుడూ నాకు ‘ఐలవ్యూ’ చెప్పలేదు. అతను అందరిలాంటివాడు కాదు. నేను లేకుండా జీవించలేడు. నేను బయటకు వెళ్తే.. కనీసం 20 సార్లయినా ఫోన్ చేసేవాడు” అంటూ వెల్లడించింది. ఇక అప్పట్లోనే అనిత ఒక కేఫ్ తెరిస్తే.. రాజేశ్ ఖన్నా పట్టుబట్టి మరీ దాన్ని మూయించాడని చెప్పింది. బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా ముద్రపడ్డ రాజేశ్ ఖన్నా.. ఆరాధన, అందాజ్, ఔరత్, ఖామోషీ, డోలీ, బంధన్ లాంటి అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోగా వెలుగొందాడు. ఇక అనితా అద్వాని విషయానికి వస్తే.. దాసీ, శాలీమార్, ఆవో ప్యార్ కరే, చోర్నీ సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులకు దగ్గరైంది.