నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక నేడు ఉదయం గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తిరిగి అసెంబ్లీ వైపు అడుగు పెట్టలేదు. ఇక నేడు ఈయన అసెంబ్లీలోకి వచ్చి వెంటనే అసెంబ్లీ నుంచి బయటకు వాకౌట్ చేశారు.
తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే సభలో ఏదైనా మాట్లాడటానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీలు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరారు. కానీ నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరదు అంటూ అధికార పక్షం తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే సేవ్ డెమోక్రసీ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసిపి నేతలు పోడియం చుట్టుముడుతూ నినాదాలు చేశారు అనంతరం బయటకు వచ్చేసారు.
ఇలా వైసీపీకి ప్రతిపక్ష పార్టీగా హోదా కల్పించాలి అంటూ జగన్ చేస్తున్నటువంటి ఈ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డికి , తన వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని తెలిపారు. ఈ విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని పవన్ సూచించారు.
కేవలం 11 సీట్లు వచ్చిన ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ఈయన ప్రశ్నించారు. జనసేన కంటే కూడా ఒక్క సీటు అదనంగా వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చేది అలా కాకుండ ఓట్ల శాతం బట్టి ప్రతిపక్ష నేతగా హోదా కావాలి అంటే జగన్ ఇండియాలో కాకుండా జర్మనీకి వెళ్లాలని తెలిపారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని చెప్పటం సరైన పద్ధతి కాదు అంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ వ్యవహార శైలిపై చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.