“వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే మేమే సభ్యత్వం తీసేస్తాం ” ప్రస్తుతం ఏపీ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చెబుతున్న మాటలు. తాను అసెంబ్లీకి వెళ్లేది లేదని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ జగన్ పదేపదే చెబుతుండటంతో దానికి కౌంటర్ ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇటీవల కొన్ని రోజులుగా జగన్ అనర్హత పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవంటూ రఘరామ చెప్పడంతో పాటు ఆర్టికల్ 190(4)ను తెరమీదకు తేవడంతో అసలు ఏమిజరగబోతోంది? జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోగా అసెంబ్లీ నుంచే పంపేస్తారా? మిగిలిన 10మంది వైసీపీ సభ్యుల పరిస్థితి ఏంటన్న అనుమానాలు, దానికి తోడుగా విస్తృత చర్చలు సాగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190లోని అంశాలను ఉపయోగించుకొని జగన్ శాసనసభ్యత్వం రద్దుచేయాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో అసలు ఆర్టికల్190ఏంటి? దానిలోని 4వ క్లాజ్ ఏమి చెబుతోంది? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి.
భారత రాజ్యాంగంలోని190 ఆర్టికల్ శాసన సభలలో సభ్యుల సెలవులు, సీట్ల కాళీ, ఏ పరిస్థితిలో స్పీకర్ సభ్యునిపై చర్యలు తీసుకోవచ్చు, అదే సభ్యుడిని ఏ నియమం ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే అంశాలను తెలుపుతోంది. ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 190లోని క్లాజ్ 4 పై సోషల్ మీడియా వేదికగా చర్చసాగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 (4) ప్రకారం 60 రోజుల పాటు ఒక రాష్ట్ర శాసన సభ సభ్యుడు (అనుమతి లేకుండా) అన్ని సమావేశాలకు గైర్హాజరైతే సభ అతని సీటు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించవచ్చు. అయితే అసెంబ్లీ జరిగిన 60 రోజులు సదరు సభ్యుడు కావాలని, ఎలాంటి కారణం లేకుండా, అదీ స్పీకర్ అనుమతి తీసుకోకుండా గైర్హాజరు కావాల్సి వుంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే జగన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నిజంగా అనుకోకపోతే ఆయన అసెంబ్లీ సీటును రద్దు చేయవచ్చా? ఆ అధికారం స్పీకర్ కు వుంటుందా? దీనిపై హైకోర్టు న్యాయవాది, రాజ్యాంగం పై రెండు పుస్తకాలు రాసిన హరిబాబు మాట్లాడుతూ అసెంబ్లీ జరిగిన 60 రోజుల పాటు గైర్హాజరయిన పక్షంలో స్పీకర్ కు ఆ అధికారం ఉంటుందన్నారు. అయితే దేశంలో ఈ ఒక్క క్లాజ్ తో ఏ ఒక్క సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోలేదని, అయితే సభ్యులు అసెంబ్లీకి రాకూడదని నిశ్చయించుకున్నా, అనర్హత పడకుండా, ఏదో ఒకరోజు వచ్చి సంతకం చేసి వెళుతుంటారని తెలిపారు. స్పీకర్లు కూడా ఈ విషయంలో పట్టుపట్టి చర్యలు తీసుకున్న ఉదాహరణలు లేవన్నారు.
అయితే, ప్రతిపక్ష నాయకులు సుదీర్ఘకాలం పాటు వాకౌట్ చేయడం ఏపీ అసెంబ్లీలో ఒక ఆచారంగా వస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి జగన్ పై అనర్హత వేటు పడుతుందని భావించడం కూడా అతిశయోక్తే అవుతుంది. అరవై రోజల పాటు ముందు అసెంబ్లీ జరగాలి. దానికి జగన్ స్పీకర్ అనుమతి లేకుండా గైర్హాజరు అయ్యే పరిస్థితులు ఉండవు. ప్రతిపక్ష హోదా ఇచ్చేదిలేదని ఏపీ స్పీకర్ తేల్చేశారు కాబట్టి సభకు జగన్ రారు, ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తారన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం స్పీకర్ గావున్న అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజులు ఆ అవకాశం జగన్ ఇస్తాడని, పులివెందులకు ఉప ఎన్నిక ఖాయమని ఆరాటపడుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు జగన్ ను రెచ్చగొట్టి మరీ అసెంబ్లీకి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. కాకుంటే వీరి గాలానికి జగన్ చిక్కుతారా? తానంతటతానే ఆ అవకాశం వాళ్లకు ఇస్తే తప్పించి పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు.
2019కి ముందు జగన్ పాదయాత్ర చేయడానికి అసెంబ్లీని వదిలి వెళ్ళినప్పుడు కూడా అలాగే చర్చ సాగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా శాసనసభా సమావేశాలకు దూరం అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబం గురించి సభలో చెడుగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ నుండి బయటకు వచ్చి తాను మళ్లీ ఎన్నికల్లో గెలిచి సభలో అడుగు పెడతానని శపథం చేసి సభలో అడుగుపెట్టలేదు. 2022 నుంచి 2024 ఎన్నికల వరకు చంద్రబాబు సభకు రాలేదు.కేవలం ఏపీలోనే కాదు అధికార పక్షం అవమానిస్తోందన్న కారణంగా ప్రతిపక్ష నేతలే అసెంబ్లీకి పోని సంఘటనలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలలోను జరిగాయి.1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితకు నిండు సభలో పరాభవం జరిగింది. దాంతో డిఎంకె అధినేత కరుణానిధి, ఆమె బద్ధ శత్రువులుగా మారారు. జయ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని తీవ్రంగా విమర్శించారు. అది భరించలేని కొందరు డీఎంకే సభ్యులు ఆమెపై చేయి చేసుకున్నారు. మరికొందరు కొంగుపట్టుకుని లాగారు. దాంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కరుణానిధిని ఓడించే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ శపథం చేశారు. ఆ ప్రకారమే 1991లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలో అడుగుపెట్టారు.