ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన జగన్ పార్టీకి వచ్చింది కేవలం 11 స్థానాలే. ఇలా ఊహించనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో జగన్ పై ట్రోలింగ్ పెరిగిపోయింది. చివరకు జగన్ పరిస్థితి సీరియస్ గా సాగే బడ్జెట్ ప్రసంగంలో కూడా కామేడీకి వాడుకునేలా తయారయ్యింది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ట్రోల్ చేసారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గురించి మట్లాడుతూ వైఎస్ జగన్ పాలనను ఎద్దేవా చేసారు. గతంలో డ్రాప్ అవుట్ పాలన సాగిందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల ఆసక్తికర కామెంట్స్ చేసారు.
గత వైసిపి పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రగం పూర్తిగా దెబ్బతిందని… పరిశ్రమలు నడిపించలేని పరిస్థితి ఉండేదని ఆర్థిక మంత్రి అన్నారు. ఇలా పరిశ్రమలు మూతపడి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు… చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలను తరిమేసారని… దీతో ఎప్పుడు ఎవరిపై పడతారోనని వ్యాపారులు భయాందోళనకు గురయ్యేవారని ఆర్థిక మంత్రి తెలిపారు.
సాధారణంగా స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి వింటుంటాం… కానీ గత పాలనలో ఏపీలో అనేక రకాల డ్రాప్ అవుట్స్ ఉండేవన్నారు. వైసిపి హయాంలో స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ సహజంగానే పెరిగాయి… ఇవే కాకుండా పరిశ్రమలు కూడా డ్రాప్ అవుట్ అయ్యాయన్నారు. రాష్ట్రం నుండి ఉద్యోగాలు కూడా డ్రాప్ అవుట్ అయ్యాయన్నారు. పేదలకు ఉపాధి కూడా డ్రాప్ అవుట్ అయ్యిందని పయ్యావుల ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో ఇన్నిరంగాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోడానికి వైసిపి పాలనే కారణం… ఇది ప్రజలు గుర్తించారు కాబట్టే వారిని ఓడించి డ్రాప్ అవుట్ చేసారని పయ్యావుల అన్నారు. అయినాకూడా వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకుల్లో మార్పు రావడంలేదు… ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా డ్రాప్ అవుట్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశత్వంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల ఎద్దేవా చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక రంగ అభివృద్దికి కట్టుబడి ఉందని… ఇందులో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. ఇప్పటికే అనేక కంపనీలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని… ఇందులో అనేక దిగ్గజ కంపనీలు ఉన్నాయన్నారు. ఎన్.టి.పి.సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపనీ, ఎన్.హెచ్.పి.సి, బి.పి.సి.ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టిసిఎస్, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, హీరో ప్యూచర్ ఎనర్జీస్, ఎకోరెస్ ఎనర్జీ తదితర సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయన్నారు. ఇలా ఏపీకి రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని…ఈ పరిశ్రమలతో 4 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
ఇక ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలకు ఆర్థిక సాయం అందించి అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు, కుప్పంలను ఎంపికచేసారు… ఈ నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేస్తారని పయ్యావుల తెలిపారు.
మొత్తంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని పయ్యావుల అన్నారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని… అందులో భాగంగానే బడ్జెట్ లో రూ.3,156 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
అభివృద్ధి… సంక్షేమం… ఏడాదికి కేటాయింపులు… దీర్ఘకాలిక లక్ష్యాలు! ‘స్వర్ణాంధ్ర-2047’ సాధన దిశగా అడుగులు! కూటమి సర్కారు ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఇదే దిశా, దశ! రూ.3,22,359 కోట్ల భారీ మొత్తంతో 2025-26 వార్షిక బడ్జెట్ రూపుదిద్దుకుంది. పేరుకు ఇది.. ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చుల పద్దు! కానీ… 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ బడ్జెట్‌లో తొలి అడుగు వేశారు. అందుకు తగిన విధంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికోసం ‘పది సూత్రాలు’ నిర్దేశించుకున్నారు.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం-అభివృద్ధి, రవాణా సదుపాయాల మెరుగుదల, తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర, టెక్నాలజీ విస్తృత వినియోగం, తక్కువ ధరలతో అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ… ఈ పది సూత్రాలతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నిర్ణయించారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికకు అనుగుణంగా 2025-26 బడ్జెట్‌ను రూపొందించారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన వ్యయం అవసరం. ఇప్పుడు పెట్టే మూలధన వ్యయమే (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) రేపు సంపద సృష్టిస్తుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించి… దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59 శాతం ఖర్చు చేస్తే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22 శాతం ఖర్చు చేసింది. జగన్ పాలనలో 60 శాతం తగ్గిన మూలధన వ్యయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెట్టింది. పెట్టుబడుల వ్యయాన్ని రెట్టింపు చేసి… ఏకంగా రూ.40,635 కోట్లు కేటాయించింది.
సాగు బాగుంటే… దుర్భిక్షం ఉండదు! అందుకే… వ్యవసాయం, నీటి సంరక్షణ పద్దులకు రూ.29,655 కోట్లు కేటాయించారు. ఇందులో ‘అన్నదాత సుఖీభవ’ పథకం వాటాయే రూ.6300 కోట్లు. అలాగే… ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లు కేటాయించారు.
సకలవర్గాల సమ్మిళిత ప్రగతి, సాధికారత… ఈ జంట సూత్రాలతో రాష్ట్ర ప్రగతిని మార్చవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా… మానవ వనరులను పెంపొందించడం… వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం… పేదరిక నిర్మూలన… శుభ్రమైన పరిసరాల్లో నివాసానికి ‘స్వచ్ఛాంధ్ర’ సాధనకు సంబంధించిన పద్దులకు ఏకంగా రూ.1,42,349 కోట్లు కేటాయించింది. ఇందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకోసమే 27,518 కోట్లు ఖర్చు చేయనుంది. తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు కేటాయించారు.
ఆర్థిక, సాంకేతిక ప్రగతితో రాష్ట్రాభివృద్ధి వేగిరమవుతుందనే ఉద్దేశంతో సంబంధిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటికి ఏకంగా 55,730 కోట్లు కేటాయించారు. అమరావతిని ‘గ్రోత్ ఇంజిన్’గా భావిస్తున్న నేపథ్యంలో… నూతన నగరాభివృద్ధికోసం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు వెచ్చించనున్నారు. ఇక… మౌలిక సదుపాయాలకు సంబంధించి మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు..
భోగాపురం, విజయవాడతోపాటు రీజనల్ ఎయిర్‌పోర్టులు, కొత్త పారిశ్రామిక నోడ్స్ కోసం రూ.605 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి రూ.13,600 కోట్లు… రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం రూ.10 కోట్లు, ఆర్టీజీఎస్, సీఎం కాల్ సెంటర్ కోసం రూ.101 కోట్లు, ఐటీ, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం రూ.300 కోట్లు కేటాయించారు.
ప్రస్తుతం 5.3 కోట్లుగా ఉన్న రాష్ట్ర జనాభా 2047 నాటికి 5.8 కోట్లకు చేరాలి.
70.6 ఏళ్లుగా ఉన్న సగటు ఆయుఃప్రమాణం 85 ఏళ్లకు పెరగాలి.
36 శాతం ఉన్న పట్టణ జనాభాను 60 శాతానికి పెంచాలి.
72 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతానికి చేర్చాలి.
ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం 45.8 శాతం మాత్రమే ఉన్న మహిళల భాగస్వామ్యాన్ని 80 శాతానికి పైగా పెంచాలి.
ప్రస్తుతం 170 బిలియన్ డాలర్లుగా ఉన్న జీఎ్‌సడీపీని 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచాలి.
ప్రస్తుతం 3,200 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 42,000 డాలర్లకు చేర్చాలి.
ఇప్పుడు 19.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 450 బిలియన్ డాలర్లకు పెరగాలి.
వచ్చే ఐదేళ్లలో వృద్ధిరేటును రెండింతలు పెంచి 29.29 శాతానికి చేర్చాలి.