సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు కావటం తెలిసిందే. ఆయన్ను విచారించిన సిట్.. తాజాగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. అయితే.. విచారణ వేళ పలు అంశాల్ని చెప్పిన రాజ్ కసిరెడ్డి.. సిట్ సిద్ధం చేసిన నేరాంగీకరపత్రం మీద మాత్రం సంతకం చేసేందుకు నో చెప్పినట్లుగా సిట్ పేర్కొంది.ప్రభుత్వానికి.. పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కువుట్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ నాకు బాధ్యత అప్పగించారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని.. పథకాల అమలుకూ ఆదాయాన్ని సమకూర్చాలని నిర్దేశించారు. – ఈ నేపథ్యంలోనే బేవరేజెస్ కార్పొరేషనే లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి.. మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం. ఐఆర్ టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చాం. తొలుత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్.. డిస్టలరీస్ కమిషనర్ గా నియమించారు.
మద్యం అమ్మకాలు.. కొనుగోళ్లు.. లేబుల్ రిజిస్ట్రేషన్ తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ వాసుదేవరెడ్డికే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన నా ప్లాన్ ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్ కు అప్పగించాం. 2023లో ఆయనకు సివిల్ సర్వీసు కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం.మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేశాం. దీనికి సంబంధించిన మీటింగ్ 2019 అక్టోబరు 13న ఆయన ఇంట్లోనే జరిగింది.విజయసాయిరెడ్డి.. మిథున్ రెడ్డి..సజ్జల శ్రీధర్ రెడ్డి.. మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ఈ మీటింగ్ లో పాల్గొన్నాం. మద్యం ఉత్పత్తిదారుల నుంచి డిస్టలరీస్ నుంచి నెలకు రూ.50-60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించాం. ఇదే విషయాన్ని సత్యప్రసాద్ కు చెప్పాం. – ఆయా బ్రాండ్లకు సంబంధించి 3 నెలల అమ్మకాలు.. దానిపై పది శాతం పెరుగుదలతో కలిపి స్టాక్ ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే.. ఈ విధానం అమల్లో ఉండే మేం అనుకున్నట్లుగా జరగదు. అందుకే మద్యం సరఫరాను ఆన్‌లైన్ తో డిసైడ్ కాకుండా ఉండాలని నిర్ణయించాం. ఏ బ్రాండ్‌ను ఎంతమేర సరఫరా చేయాలో, రిటైల్ షాపులో ఏవి అమ్మాలో మేమే డిసైడ్ చేయాలి. అలా మద్యం ఉత్పత్తి.. సరఫరా.. సేల్స్ మొత్తాన్నిమా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాం.
2019 డిసెంబరులో ఒక ప్రైవేటు బంగ్లాలో నేను.. మిథున్ రెడ్డి.. సజ్జల శ్రీధర్ రెడ్డి.. బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి మీటింగ్ పెట్టుకున్నాం. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ప్లాన్ చేశాం. మేం నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వచ్చేవి.ఎంత మద్యం సరఫరా అయ్యింది. అమ్మకాలు ఎంత జరిగాయన్న డేటా ప్రతినెలా వచ్చేది. ఇందుకోసం అనూష.. సైఫ్ అనే ఉద్యోగుల్ని నియమించుకున్నాం. ప్రతినెలా ఐదో తేదీన కమీషన్లు లెక్కలు వేసేవాళ్లం.. వీరిచ్చే డేటా ఆధారంగా కిరణ్ కుమార్ రెడ్డి.. బోనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ లు ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవారు. కంపెనీలు ముడుపుల సొమ్ములు ఇచ్చాక.. వాటిని నా దగ్గరకు చేర్చేవారు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి పంపేవాడ్ని.
ఈ కేసులో ముఖ్యంగా
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు నెలల క్రితం వరకు రాజకీయాల్లో.. వైసీపీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా పనిచేశారు. విజయసాయి లేనిదే వైసీపీ లేదన్నట్లు తన మార్కు చూపించారు. అదే సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన క్షణంలో వైసీపీ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానం పార్టీలో ప్రత్యేకమంటూ కీర్తించింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రివర్స్ అవ్వడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గట్టిగా విమర్శంచలేక, అదే సమయంలో మౌనంగా ఉండలేక సతమతమవుతోంది. అసలు విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ గందరగోళం ఎదుర్కొంటున్న
దా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2010లో జగన్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని దిక్కరించడమే కాకుండా, అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులో జగన్ ఏ1 కాగా, విజయసాయిరెడ్డిని ఏ2గా సీబీఐ గుర్తించింది. ఇక అక్కడి నుంచి ప్రతి విషయంలోనూ జగన్ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిదే అన్నట్లు ఆయన ప్రయాణం సాగింది. పార్టీలోనూ.. వైసీపీ ప్రభుత్వంలోనూ చాలావరకు విజయసాయిరెడ్డి మాటే వేదవాక్కుగా సాగిపోయింది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా, ఆయన గత ఎన్నికల్లో తప్పితే అంతకుముందు ఎన్నడూ ప్రజాక్షేత్రంలో తలపడలేదు. కానీ, అధిష్ఠానంలో పట్టు ఉండటంతో పార్టీని దిశానిర్దేశం చేసే అధికారం వైసీపీ విజయసాయికి అప్పగించింది. అయితే ఎద్దు ఎప్పుడూ ఒకవైపే పడుకోదు అన్నట్లు.. కొన్నేళ్లుగా విజయసాయికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎన్నికల అనంతరం ఆ అంతరం పూర్తిగా తెగేవరకు వెళ్లింది. రాజకీయాల నుంచి విజయసాయి నిష్క్రమించారు. ఆ సమయంలో విజయసాయి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారనేది వైసీపీ పట్టించుకోలేదు.
కేసులు, వేధింపుల వల్లే విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ సానుభూతి వ్యక్తం చేసింది. కానీ, ఆయన గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించలేకపోయిందని అంటున్నారు. అందుకే మార్చి నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పార్టీ అధిష్టానంపై విమర్శలు చేసేసరికి వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇన్నాళ్లు తమ పార్టీలో నెంబర్ టుగా చెప్పుకున్న నేత రివర్స్ లో కోటరీ ఉందని, కొందరు చేతుల్లో అధినేత బంధీగా మారిపోయారని, జగన్ ప్రజల మధ్యకు రావాలని చెప్పడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు. మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ స్థానాన్ని వదిలేయడానికి కారణాలు, అంతకుముందు చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ చేయకపోవడం వల్లే పార్టీ పునాదులు కదిలించేలా విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
తొలుత పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడ్డారని ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కాంలో దొరికన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని బెదిరించడం చర్చకు దారి తీస్తోంది. అధినేత తర్వాత నెంబర్ 2గా చెలామనీ అయిన వ్యక్తి.. తన స్థానం రెండు వేలు అంటూ చెప్పి.. అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉందని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరూ స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాత్రమే ఎదురుదాడి చేశారు. సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, వైసీపీలో ఎవరూ నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో విజయసాయిరెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే.. ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితిలో మున్ముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.