ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది.
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సిట్ అధికారులు, మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. శనివారం సాయంత్రానికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు అయిన చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగానే శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే చాలామందికి ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అని సందేహం రావొచ్చు. అయితే, ఈయన రామకృష్ణారెడ్డి కుమారుడు కాదు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని తొండూరు మండలం తుమ్మలపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి బంధుత్వం ఉన్నప్పటికీ, అది దగ్గరి చుట్టరికం కాదు.
సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల నుంచి ఓ దఫా ఎంపీగా పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆయన పులివెందుల నుంచి తన మకాంను నంద్యాలకు మార్చారు. నంద్యాల కేంద్రంగా మామగారి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అంతేకాకుండా తన సతీమణి సుజలతో కలిసి ఎస్పీవై రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకున్నారు. శ్రీధర్ రెడ్డి 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేనలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. పులివెందుల నేటివిటీ, సజ్జల ఇంటిపేరుతో ఆయన తక్కువ కాలంలోనే జగన్‌కు దగ్గరయ్యారని సమాచారం.
జగన్ ప్రభుత్వ హయాంలో ‘జే బ్రాండ్స్’గా ముద్రపడిన మద్యం బ్రాండ్లు ఎక్కువగా నంద్యాల పరిధిలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రంగానే తయారయ్యాయని ఆరోపణలున్నాయి. లిక్కర్ ముఠా ఇతర కంపెనీల నుంచి సేకరించిన మద్యాన్ని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లోనే తమ ప్రమాణాల మేరకు నాణ్యతను మార్చి ప్యాక్ చేశాడని ఆరోపణలున్నాయి.. ఈ విధంగా మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కీలక కేంద్రంగా మారిపోయిందని సిట్ విచారణలో తేల్చిందని సమాచారం.
మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటిని స్వీకరించడం, గమ్యస్థానాలకు తరలించడం వంటి అనేక కార్యకలాపాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ భావిస్తోంది. ఈ దందాలో రాజ్ కసిరెడ్డికి ఏ మేర పాత్ర ఉందో, శ్రీధర్ రెడ్డికి కూడా అంతే కీలక పాత్ర ఉందని సిట్ తమ దర్యాప్తులో అనుమానిస్తోంది. తాజా అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.