ఏనాడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రాష్ట్రంలోని డెల్టాల ఆధునీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమని, ముంపు సమస్యలను పరిష్కరించుకోగలమని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కాలువల్లో కలుపు, ఆక్రమణలు, శివారు భూములకు నీరు అందకపోవడం, పైనున్న భూములు ముంపుకు గురవటం వంటి సమస్యలను బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సుస్పష్టమైన సమాధానం ఇచ్చారు.
కృష్ణ, గోదావరి బేసిన్లలోని మురుగు కాలువలు, పంట కాలువలు ఇంచుమించు అన్ని కూడా కొల్లేరు లోకే వస్తున్నాయి. ఈ నీరంతా కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి కలవాల్సి ఉంది. అయితే కాలువలు ఆక్రమణలతో కుంచించుకుపోవడం, కలుపు మొక్కలతో నిండిపోవడం వంటి కారణాలు మూలంగా ప్రవాహం ముందుకు సాగటం లేదు. అందువల్ల కృష్ణ గోదావరి, కొల్లేరు బేసిన్ల లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని డెల్టాల పరిధిలో కాలువలు, డ్రైన్లు డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సలహా ఇచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయమని కూడా ఆయన తమకు సూచించారు. కాలువల్లో కలుపు తొలగింపు, లాకులు, షట్టర్లు డోర్లు మరమ్మత్తు పనులు, గ్రీజు పెట్టడం వంటి పనుల నిర్వహణకు సంబంధించి ప్రతి ఏటా మార్చిలో ప్రతిపాదనలు తయారు చేయడం,ఏప్రిల్ లో టెండర్లు పిలవడం, మే నెలలో పనులు చేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దీనిని గత జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఓ అండ్ ఎం పనులు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాని దుస్థితి లోకి వెళ్ళిపోయారు. అలాగే నీటిపారుదల వ్యవస్థ నిర్వహణలో లష్కర్ల పాత్ర చాలా కీలకం. ఒకప్పుడు ఎనిమిది వేల మంది ఉండే లష్కర్లు నేడు 600 మంది కి చేరిపోయారంటే జగన్ అరాచక పాలనకు అద్దం పడుతుంది.
నేడు లాకులు షట్టర్లు ఎత్తాలన్నా దింపాలన్నా, లాకుల్లో గ్రీజ్ పెట్టాలన్నా ఆ పనులు ఏఇలు చేయాల్సి వస్తుంది. ప్రతి కిలోమీటర్ కాలువకు ఒక లస్కర్ ఉండాలనే పాత సాంప్రదాయ పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు వస్తూనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు సభకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాలకు సంబంధించి 60 వేల మంది ఆయకట్టు రైతులకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. వీరంతా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పనిచేస్తూ కాల్వల సమర్థ నిర్వహణకు సాయపడుతున్నారని మంత్రి చెప్పారు. కొన్ని నియోజకవర్గాలలో నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు వాళ్ళ సొంత నిధులతో అత్యవసర పనులు చేసుకోవడం ఎంతో ముదావహ మన్నారు.
సాగునీటి సంఘాల గొప్ప వ్యవస్థను జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో నీరు కార్చింది అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నీటిపారుదల రంగంలో రైతులకు భాగస్వామ్యం కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. ఓ అండ్ ఎం పనులు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల అనేక అవకతవకులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ఓ అండ్ ఎం పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే బిల్లులు కాజేసిన అనేక ఉదంతాలు నా దృష్టికి వచ్చాయి. అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న బాధ్యుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 లక్షల లోపు ఓ అండ్. ఎం పనులు, ఇతర అత్యవసర పనులు నీటి సంఘాలకు నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పద్ధతి ఇప్పుడు ఉంది. ఈ మొత్తాన్ని 10 లక్షలు పెంచి ఆ పనులను నీటి సంఘాల తోటే చేయించే ఆలోచన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉందని నిమ్మల చెప్పారు.