అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకుని మళ్లీ ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్పూర్తి దాయకంగా ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్ లో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలు ప్రవహించేలా బడ్జెట్ కేటాయుంపులు ఉన్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తూ నిధులు కేటాయుంపు జరిగిందన్నారు. అత్యంత వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదితులున్న ప్రకాశం జిల్లా కు వెలిగొండ పూర్తి చేయడం ద్వారా, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం లో గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది, బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రాధాన్యత ఇచ్చి పనులు ప్రారంభించేవిధంగా బడ్జెట్ కేటాయుంపులు ఉన్నాయన్నారు. నీరు చెట్టు నుండి ఇరిగేషన్ పనుల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ప్రభుత్వంపై విశ్వసనీయత పెంచామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. నాటి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు వరకు రాష్ట్రంలో ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.