పెద్ద ఎత్తున నష్టపోయిన ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల పర్యవసానం ప్రకారం కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.1554.99 కోట్లను కేటాయించగా, అందులో ఏపీకి భారీ మొత్తంలో రూ.608.8 కోట్లు అందనున్నాయి. తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు కేటాయించారు.
ఏపీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం వెనుక ప్రధాన కారణం, రాష్ట్రంలో గతేడాది జరిగిన భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపోవడం, ఆస్తి, ప్రాణ నష్టం కలగడమే. కేంద్రం ఈ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ కింద ఈ నిధులను ఆమోదించింది. త్వరలోనే ఈ నిధులు రాష్ట్ర ఖాతాలో జమ కానున్నాయి.
కేంద్రం తాజాగా ప్రకటించిన ఈ విపత్తు నిధుల్లో ఏపీకి అత్యధికం కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నందునే ఈ ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీకి ఎల్లప్పుడూ ముందే నిధులు వస్తున్నాయి అనేది తాజాగా మరోసారి రుజువైంది.
ఇప్పటికే సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ల్లోనూ ఏపీకి భారీ కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. ప్రతి కేంద్ర సహాయం ప్రకటించినప్పుడు ఏపీ ముందుండటం విశేషం. ఇది రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.