లిక్కర్ స్కామ్‌లో కొనసాగుతున్న విచారణ
నిన్న కసిరెడ్డి రాజశేఖర్ నివాసంలో సిట్ సోదాలు..
లిక్కర్ స్కామ్‌లో వసూళ్లు, లావాదేవీలపై ఆరా
విచారణకు హాజరుకావాలని ఇప్పటికే మూడుసార్లు నోటీసులు..
సిట్ అధికారుల నోటీసులకు స్పందించని కసిరెడ్డి.
ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితుడు కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్(Hyderabad Jubililee Hills)తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు సీరియస్ అయ్యారు.కాగా లిక్కర్ స్కాంలో కసిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. విచారణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఆయన స్పందించలేదు. పైగా విచారణకు డుమ్మా కొట్టారు. కసిరెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు. వైసీపీ హయాంలో కసిరెడ్డి ఐటీ సలహాదారుగా పని చేశారు. మద్యం తయారీ దారుల నుంచి రూ. 60 కోట్లు వసూలు చేశారని, అంతేకాదు రూ. 3 వేల కోట్ల వరకూ జగన్ ప్యాలెస్‌కు చేర్చారని కసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి ఈ దందా నిడిపినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీల నుంచి మద్యం ఎంతకు కొనుగోలు చేయొచ్చు..ఏ రోజు ఏ బ్రాండు విక్రయించాలనేది కసిరెడ్డినే నిర్ణయించేవారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో ఈ గుట్టు రట్టు చేసేందుకే లిక్కర్ స్కాంను కూటమి ప్రభుత్వం సిట్‌కు అప్పగించిందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం కసిరెడ్డి ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జగన్ ఐటీ సలహాదారుగా నియమించారు. ఏపీ లిక్కర్ స్కాంపై సీఐడీ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. చాలా విషయాలు వెలుగులోకి తెచ్చిందని చెబుతున్నారు. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటపడుతోందని చెబుతున్నరాు. ఇప్పటికే మిథున్ రెడ్డికి ఈ స్కాంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఆయన సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు.వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి . వైసీపీ గెలవగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. మద్యనిషేధం పేరిట దుకాణాలు తగ్గిస్తామని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా బయట దొరికే బ్రాండ్ల మద్యం మొత్తం ఏపీలో బ్యాన్ చేశారు. కేవలం కొన్ని కంపెనీలు.. అది కూడా ఏపీ లోనే మద్యం అమ్మే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. అవన్నీ వైసీపీ నేతలవన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ కూడా విచారణ చేయాలని సిఫారసు చేస్తోంది.
లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ గా చెబుతున్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడమే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతోందని అంటున్నారు. ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశంతో అడుగులు వేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఏఎస్పీ భూషణం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో సంపాదించిన డబ్బుతో రాజ్ కసిరెడ్డి సినిమాలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారని ప్రముఖ మీడియా లో కధనాలు వచ్చాయి. సినిమా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు బినామీ పేర్లతో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారని అంటున్నారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్న సమయంలో మద్యం స్కాంపై కేసులు నమోదయ్యాయని అంటున్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్స్ లోనూ వాటాలు పెట్టారని చెబుతున్నారు. కసిరెడ్డి కూతురు ఇషానీ పేరుతో ఓ ఇన్ఫ్రా సంస్థను నెలకొల్పారని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వాటాలు పెట్టారని, ఈ విధంగా బ్లాక్ మనీని చెలామణీకి తెచ్చారని పోలీసులు చెబుతున్నారు
గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఎక్కువగా మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షించారని ఫిర్యాదులు ఉన్నాయి. హైదరాబాదు కేంద్రంగా మరో వైసీపీ నేతతో కలిసి ఆయన ఈ దందా నడిపినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ అమ్మాలనేది రాజ్ కసిరెడ్డి డిసైడ్ చేసేవారని, మందుబాబులు ఏం తాగాలో కూడా ఆయనే నిర్ణయించేవారని అంటున్నారు. అంతేకాకుండా తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డరులు జారీ చేసేవారని, ఇందుకోసం కేసుకు రూ.150 వసూలు చేసేవారని చెబుతున్నారు. ఇలా ఒక్కో నెల కనీసం రూ.60 కోట్లు కమీషన్లుగా దండుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ పాలనలో నాలుగేళ్ల 8 నెలల పాటు ఈ దందా కొనసాగిందని, మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా కూడేశారని రాజ్ కసిరెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికలు, టీవీ చానళ్లలో ఈ ఆరోపణలపై కథనాలు ప్రచారం అవుతున్నా, ఆయన ఇంతవరకు ఖండించకపోవడాన్ని సిట్ పరిగణలోకి తీసుకుంటోందని చెబుతున్నారు.
ఏపీ నుంచి తప్పించుకుని వస్తున్న మద్యం స్కాం నిందితులకు పోలీసుశాఖ నుంచి సహకారం అందుతున్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. తాము వెళ్లే చోటు విషయంలో ముందే సమాచారం లీకు అవుతుండటంతో నిందితులు పరార్ అవుతున్నట్లు సందేహిస్తున్నారు. కొందరు ఇంటి దొంగలే ఈ సమాచారం నిందితులకు చేరేలా సహకరిస్తున్నారని అంటున్నారు. దీంతో ఏపీలోని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ నిఘా వేసినట్లు చెబుతున్నారు.