ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన వివరించారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. అతడిని విజయవాడ తరలిస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతలోనే అతడిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) సోమవారం మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇదే కేసులో ఇటీవల విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత కూడా రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. విజయసాయిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారని, ప్రస్తుతం తన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. మరోవైపు సిట్ అధికారులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ… రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాజాగా న్యాయస్థానంలోనూ అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.