‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ రివ్యూ
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్- విజయశాంతి- సయీ మంజ్రేకర్- సోహైల్ ఖాన్- శ్రీకాంత్- పృథ్వీ- ఆనంద్ తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా-ప్రదీప్ చిలుకూరి
మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా-సునీల్ బలుసు
కథ-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి. లెజెండరీ నటి విజయశాంతి ఇందులో కళ్యాణ్ రామ్ తల్లిగా నటించడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే మంచి అంచనాల మధ్య విడుదలైంది. ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి (విజయశాంతి) డిపార్ట్మెంట్లో మంచి పేరుంటుంది. ఆమె భర్త నేవీ అధికారి. వీళ్లిద్దరి కొడుకు అర్జున్ కూడా ఐపీఎస్ క్లియర్ చేసి ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. అలాంటివాడు అనూహ్య పరిస్థితుల్లో క్రిమినల్ గా మారతాడు. విశాఖపట్నంలో సమాంతర ప్రభుత్వం నడిపే స్థాయికి చేరుకుంటాడు. కొడుకు చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో తల్లి అతణ్ని అసహ్యించుకుని దూరం పెడుతుంది. కానీ తల్లికి పెద్ద ముప్పు ఉందని తెలిసి ఆమెను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు అర్జున్. ఇంతకీ ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన అర్జున్.. క్రిమినల్ ఎందుకయ్యాడు? వైజయంతికి ఎవరి నుంచి ముప్పు వాటిల్లింది? ఆమెను అర్జున్ కాపాడుకోగలిగాడా? చివరికి తల్లి మనసు గెలిచి ఆమెకు దగ్గరయ్యాడా? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఈ రోజుల్లో రొటీన్ మాస్ మసాలా కథలతో ప్రేక్షకులను మెప్పించడం సవాలే. కథలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. లేదా ఒక బలమైన ఎమోషన్ అయినా తోడవ్వాలి. కథను డ్రైవ్ చేసే ఏదో ఒక టిపికల్ పాయింట్ లేకుండా రెండు రెండున్నర గంటలు ఆడియన్సుని కుదురుగా కూర్చోబెట్టడం కష్టం. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తన తొలి చిత్రానికి ‘ఎమోషన్’ బాటనే ఎంచుకున్నాడు. తల్లీకొడుకుల ఎమోషన్ మీద ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నడిపించడానికి ప్రయత్నించాడు. తల్లేమో చట్టాన్ని కాపాడే పోలీసాఫీసర్.. కొడుకేమో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న క్రిమినల్.. ఈ కాన్ఫ్లిక్టే ఈ చిత్రానికి ప్రధాన బలం. మిగతా కథంతా మామూలుగా అనిపించినా.. హీరో ఎలివేషన్లు- భారీ యాక్షన్ సీక్వెన్సులు అన్నీ రొటీన్ గా సాగిపోయినా.. తల్లీకొడుకుల ఎమోషన్ సినిమాను ముందుకు నడిపించేసింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లోని షాక్ ఫ్యాక్టర్.. భావోద్వేగాలు అంతకుముందున్న లోపాలను భర్తీ చేయడంతో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’కి పాస్ మార్కులు పడిపోతాయి.
అర్జున్-వైజయంతి అనే రెండు పాత్రల చుట్టూనే ఈ సినిమా కథ నడుస్తుంది. ఐతే అందులో అర్జున్ పాత్రలో నిజానికి ఏ ప్రత్యేకతా కనిపించదు. ఐపీఎస్ క్లియర్ చేసిన వాడు.. క్రిమినల్ అయ్యాడంటూ తన పాత్రను పరిచయం చేస్తారు. దాని వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది కొన్ని వందల సినిమాల్లో చూసిందే. తనకు జరిగిన ఓ అన్యాయం మీద తిరగబడే క్రమంలో ఒక ప్రాంతానికి దేవుడిలా మారిపోవడం.. ప్రభుత్వానికి సమాంతరంగా ఒక వ్యవస్థను నడపడం.. విలన్లు అతడి పేరు చెబితే అదిరిపోవడం.. ఇదంతా ఒక టెంప్లేట్లో సాగిపోయే వ్యవహారం. యాక్షన్ సీక్వెన్సులు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. కథ నడిచే విధానం అయితే రొటీన్ ఫీల్ కలిగిస్తుంది. ఐతే కేవలం ‘అర్జున్’గా చూసినపుడు ఈ పాత్రలో ఏ ప్రత్యేకతా కనిపించదు. కానీ వైజయంతి కొడుగ్గా మాత్రం తన క్యారెక్టర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రాణంగా ప్రేమించే తల్లే తనను అసహ్యించుకుని దూరం పెడితే.. ఆమె ప్రేమను తిరిగి పొందేందుకు తపిస్తూ.. ఆమెను కాపాడుకుంటూ సాగిపోయే కొడుకు తాలూకు ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తల్లి కొడుకును అపార్థం చేసుకోవడానికి.. వారి మధ్య దూరం పెరగడానికి దారి తీసే పరిస్థితులను దర్శకుడు ఎఫెక్టివ్ గా చూపించాడు.
తల్లి పుట్టిన రోజును కొడుకు సెలబ్రేట్ చేయడం అనే పాయింట్ మీద కథలో కీలక సన్నివేశాలను రాసుకోవడం బాగుంది. పతాక సన్నివేశాల్లోనూ ఆ పాయింటే కీలకం. తల్లి మీద ప్రేమతో హీరో ఎంత దూరం వెళ్తాడన్నది చాలా బలంగా చూపించారు. యాక్షన్ ఘట్టాలు.. స్లో మోషన్ షాట్లతో కొంత భారంగా సాగే ద్వితీయార్ధంలో చివరి అరగంట మాత్రం మంచి ఊపుతో సాగుతుంది. కథలో.. పాత్రల్లోని మలుపులు పతాక సన్నివేశాల మీద ఆసక్తి రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ గురించి చిత్ర బృందం చెప్పుకున్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. అందులోని షాక్ ఫ్యాక్టర్.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. పతాక సన్నివేశాలు బాగున్న సినిమా మీద ఆటోమేటిగ్గా పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అంతకుముందున్న లోపాలు కూడా పక్కకు వెళ్లిపోతాయి. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కూడా అదే ఫీలింగ్ ఇస్తుంది. సగటు మాస్ కథలా అనిపించినప్పటికీ.. తల్లీ కొడుకుల ఎమోషన్ మీద నడిచే ఎపిసోడ్లు.. పతాక సన్నివేశాలు సినిమాను కింద పడిపోకుండా కాపాడాయి. హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. మాస్-ఫ్యామిలీ ఆడియన్స్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’తో బాగానే కనెక్ట్ అవుతారు.
నటీనటులు:
సీరియస్ మాస్ పాత్రలు నందమూరి కళ్యాణ్ రామ్ కు బాగా నప్పుతాయి. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో అతడికి అలాంటి పాత్రే దక్కింది. హీరోయిజం ఎలివేట్ అయ్యే యాక్షన్ సీన్లలో సీన్లలో.. అలాగే ఎమోషన్లు పండించాల్సిన సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ తన ప్రతిభను చూపించాడు. పతాక సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ బాగుంది. విజయశాంతి ఇంత గ్యాప్ తీసుకుని చేసిన పాత్ర అంటే ప్రత్యేకంగా ఉంటుందనుకుంటాం. వైజయంతి క్యారెక్టర్ అలాంటిదే. ఆ పాత్రకు ఒక హుందాతనం తీసుకొచ్చేలా ఆమె నటించారు. శ్రీకాంత్ పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. తన నటన కూడా ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో సోహైల్ ఖాన్ మాత్రం సాధారణంగా అనిపిస్తాడు. ఆ పాత్ర కూడా రొటీన్ అనిపిస్తుంది. హీరోయిన్ సయీ మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. తనది గ్లామర్ పాత్రేమీ కాదు కానీ.. అలా అని పెర్ఫామెన్సుకి పెద్దగా స్కోపున్నది కూడా కాదు. పృథ్వీ ఓ కీలకమైన పాత్రలో రాణించాడు. హీరో తండ్రి పాత్రలో ఆనంద్ ఓకే.
సాంకేతిక వర్గం:
అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకట్రెండు పాటలు సోసోగా అనిపిస్తాయి. ఐతే అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం దగ్గర తన మార్కు చూపించాడు. యాక్షన్ సీక్వెన్సులు.. ఎమోషనల్ సీన్లలో ఆర్ఆర్ ప్రభావవంతంగా సాగింది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం సగటు కమర్షియల్ సినిమాల స్టయిల్లో సాగింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా రిచ్ గా తీశారు. ప్రదీప్ చిలుకూరి.. శ్రీకాంత్ విస్సా కలిసి రాసిన స్క్రిప్టు మరీ గొప్పగా అనిపించదు. అలా అని తీసిపడేసేలా లేదు. తల్లీ కొడుకుల నేపథ్యంలో సన్నివేశాలు బాగా రాసుకున్నారు. డైలాగులు బాగున్నాయి. ప్రదీప్ టేకింగ్ కమర్షియల్ సినిమాల టెంప్లేట్లో సాగిపోయింది. పతాక సన్నివేశాల్లో తన ప్రతిభ కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లు అతను బాగా డీల్ చేశాడు. కానీ కథ పరంగా క్లైమాక్స్ మీదే మొత్తం భారం మోపేశాడనిపిస్తుంది.
రేటింగ్- 2.5/5