బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై 11 మంది సినీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టారుబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, అజయ్, నటులు విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, ట్రావెలర్ సన్నీయాదవ్, అనలిస్టు సుధీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.తమపై కేసు నమోదు కావడంపై వీరిలో కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందించారు.
మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో #SayNoToBettingApps హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోందిక్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్‌ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వస్తాయని పోలీసులు చెప్పారు.ఈ యాప్‌లవల్ల ఎంతో మంది డబ్బు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని ఐపీఎస్ అధికారి సజ్జనార్ అన్నారు.
బెట్టింగ్ యాప్‌ల మాయలోపడి, అప్పులపాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకునే వారి వార్తలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.ఇందులో ముందుగానే ఆటను యాప్‌లో ప్రోగ్రామ్ చేస్తారు. నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు. తరువాత ఒకేసారి పెద్దమొత్తంలో అంటే వేలు, లక్షలు పెట్టేలా చేసి, అవి పోయేలా చేస్తారు.
బెట్టింగ్ యాప్‌లలో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు. ఆ బోనస్‌తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపించి, మళ్లీ మళ్లీ డిపాజిట్ చేయిస్తారు. తరువాత డిపాజిట్ పోయినట్లుగా చూపిస్తారు.తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో చెప్పిస్తారు. అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెబుతారు.
ఇవే కాక వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.వాలెట్‌లో డబ్బులు ఉన్నట్లుగా చూపించి పెట్టుబడి పెట్టిస్తారు. కానీ, గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు వీల్లేకుండా చేస్తారు. ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్ కు ఏపీ, తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారనేది ఆరోపణ.
బెట్టింగ్ యాప్స్ అక్రమంగా ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.”యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.” అని చెప్పారాయన. 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై నమోదైన కేసులో పోలీసులు వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు సేకరించాక తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కోసం యూట్యూబర్లు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆయా కంపెనీలు ఎంచుకుంటున్నాయి. ఇందుకోసం లక్షల్లో చెల్లింపులు చేస్తున్నారని ఇన్‌ఫ్లూయెన్సర్లు చెబుతున్నారుబెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయాలని ఏ విధంగా సంప్రదిస్తారో వశిష్ట 360 కంపెనీ సీఈవో వంశీకృష్ణ బీబీసీకి వివరించారు. తనను ఎంతోమంది సంప్రదించినా.. ఎవరికి మద్దతుగా వీడియోలు చేయలేదని స్పష్టం చేశారు.
”మెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. బెట్టింగ్ యాప్ గురించి తాము రూపొందించిన వీడియోలో కనిపించమని అడుగుతారు. కొందరు ప్రమోషన్ ప్లేట్ (పోస్టర్) వేయాలని కోరుతుంటారు. అందుకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తామని ఆశ పెడుతుంటారు.”లైవ్‌లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్లుగా చూపించి, తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తుంటారు.
ఇలా ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోయర్లు పడకూడదంటున్నారు వీసీ సజ్జనార్.’బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను అన్ ఫాలో చేయండి, వారి అకౌంట్లకు రిపోర్టు కొట్టండి.” అని సూచించారు.ఇప్పటికే విశాఖపట్నానికి చెంది లోకల్‌బాయ్ నానీ అలియాస్ వాసుపల్లి నానీని ఫిబ్రవరిలో విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం పొందవచ్చంటూ ఒక వీడియోను రూపొందించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడనే ఫిర్యాదు అందినట్టు పోలీసులు చెప్పారు.
నానీ చేసిన వీడియోపై సజ్జనార్ సైతం ట్వీట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు.”బెట్టింగ్ కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి తప్పు చేశాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా.” అని అప్పట్లో చెప్పారు నానీ.మరోవైపు యూట్యూబర్ హర్షసాయి కూడా స్పందించారు.మా ఆడియన్స్, ఫాలోయర్లకు నష్టం కలిగించేది చేయం. రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అసలు చేయం.” అని చెప్పారు.
”తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. అందుకు సారీ. ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ప్రభావితం కావొద్దు. మోసాల బారిన పడొద్దు.” అని చెప్పారు మరో యూట్యూబర్ సుప్రీత.తాను ఏడాది కిందట బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని, అది ఇప్పుడు వైరలవుతోందన్నారు నటి రీతూ చౌదరి.
”ఏ బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్‌ను నమ్మకండి. ఫోన్‌లో బెట్టింగ్ యాప్స్ ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.” అని అన్నారామె.