ఎల్లుండి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ రాయబారులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. వీరే కాకుండా, ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, మురికివాడల నివాసితులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా భాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి హాజరు కానున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేపు బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై, శాసనసభా పక్ష నేతను, మంత్రులను ఎన్నుకోనుంది.