ప్రధాని మోదీ – షా ద్వయం కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన వక్ఫ్ బిల్లు ఆమోదంతో తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల పైన గురి పెట్టిన మోదీ – షా ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా రాష్ట్రాలకు అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు సూత్ర ప్రాయంగా ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఈ ఇద్దరూ పార్టీ నేషనల్ చీఫ్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బీజేపీ అధినాయకత్వం కీలక ప్రకటనకు సిద్దం అవుతోంది. జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల కు చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న వేళ దక్షిణాది పైన స్పెషల్ ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఆరెస్సెస్ నేపథ్యం.. బీజేపీలో పలు హోదాల్లో కొనసాగిన ఏపీకి చెందిన నేత రామ్ మాధవ్ పేరు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కీలకంగా పని చేసారు. 1981లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆ తరువాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ తరపున కీలక పాత్ర పోషించారు. జమ్మూలో పీడీఎఫ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించారు.
ఏపీలోని అమలాపురంకు చెందిన రామ్ మాధవ్ కు ఆరెస్సెస్ నేపథ్యం కలిసి వచ్చే అంశం. ఉన్నత విద్యా వంతుడు అయిన రామ్ మాధవ్ కు ఇవ్వటం ద్వారా పార్టీ – ప్రభుత్వ సమన్వయం తో పాటుగా పూర్తి స్థాయిలో ఆరెస్సెస్ మద్దతు కూడగట్టవచ్చని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు సైతం నేషనల్ చీఫ్ పదవి కోసం పరిశీలనకు వచ్చింది. అందుకు కిషన్ రెడ్డి సముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. బీజేపీ వరుసగా గెలిచిన హర్యానా, మహారాష్ట్ర, డిల్లీలో ఆరెస్సెస్ ప్రణాళికా బద్దంగా బీజేపీ విజయానికి పని చేసింది. జమిలికి సిద్దం అవుతున్న వేళ ఆరెస్సెస్ పాత్ర క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో, రామ్ మాధవ్ పార్టీలో పలు కీలక సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారనే గుర్తింపు ఉంది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయాధ్యక్షులుగా పని చేసారు.