ముంబై హైకోర్టు, మహారాష్ట్ర లోని థానే మరియు బోరివలి మధ్య రహదారి సొరంగం నిర్మాణం కోసం ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA ), MEIL కి కాంట్రాక్ట్ కేటాయించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.
బాంబే హై కోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మరియు జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రవిప్రకాశ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించింది. ఇందులో MEIL అందించిన బ్యాంక్ గ్యారంటీలు చెల్లుబాటు పై అనుమానం వ్యక్తం చేస్తూ పిటీషనర్ రవి ప్రకాష్ కేసు దాఖలు చేసారు.
పిటిషనర్ రవి ప్రకాశ్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు ప్రారంభించే ముందు, MMRDA తరఫున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, తుషార్ మెహతా మరియు MEIL తరఫున హాజరైన మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ముకుల్ రోహత్గీ, పిల్ యొక్క ప్రామానికత పై మరియు పిటిషనర్ హోదాపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాదులైన ముకుల్ రొహత్గి మరియు తుషార్ మెహతా పిటిషనర్ రవి ప్రకాశ్ న్యాయస్థానాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. MEIL తరఫున ముకుల్ రోహత్గీ, డివిజన్ బెంచ్‌కు పిటిషనర్ యొక్క లాభాపేక్ష చర్యలను వివరించడంతో పాటు పిల్ చెల్లుబాటు కానివ్వకూడదని ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు తెలియజేశారు.
తుషార్ మెహతా వాదిస్తూ MEIL దాఖలు చేసిన అప్లికేషన్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని, న్యాయస్థానం ఈ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకోవడం అవసరమని తెలిపారు. కేసు విషయంపై స్పందించడానికి తాము పూర్థి స్థాయి లో సిద్ధంగా ఉన్నామని, కానీ ముందుగా MEIL దాఖలు అప్లికేషన్‌పై విచారణ అవసరమని చెప్పారు.
ప్రశాంత్ భూషణ్ , ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌కు సమాధానంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. కోర్ట్ ఆ అంశాన్ని నమోదు చేసి, కేసును మార్చి 5న MEIL దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌పై విచారణకు ఆదేశించింది.