దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్ లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో ఎన్డీఆర్‌ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం కల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో డజను మందికి పైనే శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఆ భవనంలో ఒక పోర్షన్ లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే…
ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా… ఇద్దరు గాయపడ్డారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), ఢిల్లీ పోలీసులు, స్థానిక రెస్క్యూ టీమ్‌లు శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించి తరలించడానికి సెర్చింగ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
డివిజనల్ అగ్నిమాపక అధికారి రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ… ‘‘తెల్లవారుజామున 2:50 గంటలకు ఇల్లు కూలిపోవడం గురించి మాకు కాల్ వచ్చింది… మేము సంఘటనా స్థలానికి చేరుకుని, భవనం మొత్తం కూలిపోయిందని, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుసుకున్నాము… ప్రజలను రక్షించడానికి ఎన్‌డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది పని చేస్తున్నారు’’ అని తెలిపారు. ఇక, శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ధూళి తుఫాను, భారీ వర్షాల బీభత్సం సృష్టించాయి. ఈ కారణంగా కూలిపోయిందని భావిస్తున్నారు.
నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అడిషినల్ డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ… ‘‘ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. 14 మందిని రక్షించారు… కాని వారిలో నలుగురు చనిపోయారు. అది నాలుగు అంతస్తుల భవనం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇంకా 8-10 మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు.