వైసీపీ నేత.. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కు సంబంధించిన ఆస్తుల వేలం ప్రక్రియ షురూ అయ్యింది. దీనికి కారణం ఎల్ఐసీ అనుబంధ సంస్థ నుంచి తీసుకున్న రూ.310 కోట్ల అప్పును తిరిగి చెల్లించకపోవటమే. ఎల్ఐసీ నుంచి బుట్టా రేణుక దంపతులు రుణం తీసుకొని.. దానికి సంబంధించిన ఈఎంఐలు కొద్దికాలం కట్టినా.. ఆ తర్వాత నుంచి కట్టలేదు. గడిచిన ఐదేళ్లుగా వారు రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో విఫలమవుతున్నారు.
అప్పు ఇచ్చిన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు బుట్టా దంపతులకు పలుమార్లు నోటీసులు పంపారు.అయినప్పటికి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 2018లో పదిహేనేళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల అప్పును తీసుకున్నారు. ఈ మొత్తాన్ని బుట్టా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్.. బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్.. మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు వాడారు.
తీసుకున్న అప్పునకు సంబంధించి రూ.40 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అయితే.. ఐదేళ్ల నుంచి రుణాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ జరగకపోవటంతో అసలు.. వడ్డీ మొత్తం కలిపి రూ.340 కోట్లుగా మారింది. ఒప్పందంలో భాగంగా తీసుకున్న అప్పునకు ప్రతి నెలా రూ.3.40 కోట్ల మొత్తాన్ని చెల్లించిల్సి ఉంటుంది. వడ్డీ భారం ఎక్కువగా ఉందని.. కొన్ని ఆస్తుల్ని అమ్మి రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని కోరారు. అయితే.. వీరి ప్రతిపాదన నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంటూ సంస్థ ప్రతినిధులు అందుకు ఒప్పుకోలేదు.
దీంతో.. తీసుకున్న అప్పును తిరిగి వసూలు చేసుకునే పనిలో భాగంగా పలు మార్గాల్ని చేపట్టింది. అందులో ఒకటి.. కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు బుట్టా రేణుక దంపతులకు చెందిన 5 వేల గజాల ఆస్తిని వేలం వేసే ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్ లోని ఈ ఆస్తి విలువ రూ.145కోట్లుగా పేర్కొంటూ వేలం వేయగా.. దీన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. మరోవైపు మాదాపూర్ లోని 7205 గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ ను వేలం వేశారు. అయినా.. దీనికి ఎలాంటి స్పందనా లేదు. నిజానికి.. ఈ రెండు ఆస్తులు ప్రైమ్ లొకేషన్లలో ఉండటమే కాదు.. భారీ డిమాండ్ ఉన్న ఆస్తులు. అయినప్పటికి వేలానికి ఎవరూ ముందుకు రాకపోవటమే అసలు సిసలు ట్విస్టుగా అభివర్ణిస్తున్నారు. అయితే.. పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో మరోసారి వేలానికి సిద్ధమవుతోంది ఎల్ఐసీ సంస్థ. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.