ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా మంచి జోష్‌లో ఉంది. అదే జోరులో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను అందుకోవాలనే కసితో ఉంది. తద్వారా 2000 నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.
మరోవైపు సమష్టి ప్రదర్శనలతో ఫైనల్ చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. లీగ్ దశలో టీమిండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆ జట్టులోనూ క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. దాంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుందా? లేక ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా మైదానంలో అలసత్వం కనబర్చాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో పేసర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో పిచ్‌పై ఎక్కువ టర్న్ లభించలేదు. ఫైనల్‌కు కూడా అదే తరహా పిచ్ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా పేసర్‌గా హర్షిత్ రాణాను ఆడించాలని గంభీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదు నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యారు. ఫైనల్లో భారత్ విజయం సాధించాలంటే ఈ ఇద్దరూ శుభారంభం అందించడం కీలకం. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు జడేజాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో అతను సత్తా చాటుతున్నాడు. కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తీ.. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు. మరోసారి సమష్టి ప్రదర్శన కనబరిస్తే టీమిండియాకు తిరుగుండదు.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. భారత జట్టు మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకోగా, న్యూజిలాండ్ రెండోసారి కప్పును ఎగరేయాలని చూస్తోంది. కానీ, క్రికెట్ అనూహ్య మలుపులతో నడిచే ఆట. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ టై అయినా, బౌండరీ లెక్క ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు అలాంటి వివాదాస్పద పరిణామాలు జరగకుండా, ఐసీసీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
ఈ మ్యాచ్ టై అయినా గెలుపు ఖచ్చితంగా తేలేలా సూపర్ ఓవర్‌ను ప్రవేశపెట్టారు. మొదటి సూపర్ ఓవర్‌లోనూ సమానం వస్తే, మరొక సూపర్ ఓవర్ ఉంటుంది. ఇదే విధంగా గెలుపు తేలేవరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి. ఈ రూల్ 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ అనుభవించిన నిరాశను దృష్టిలో పెట్టుకునే రూపొందించబడింది. కాబట్టి, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టై అంటే విజేత ఎవరో ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది.
ఇక వర్షం కారణంగా మ్యాచ్ పూర్తికాకపోతే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయిలో జరుగుతున్న నేపథ్యంలో వర్షపు అవకాశాలు చాలా తక్కువ. అయితే, ఏదైనా అనూహ్య పరిణామాల వల్ల మ్యాచ్ పూర్తికాకపోతే, భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు సంయుక్త విజేతలుగా ప్రకటించబడతాయి. ఇదే 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో శ్రీలంక, భారత్ మధ్య జరిగిన ఘటన. ఆ మ్యాచ్ రెండు రోజులు కొనసాగినప్పటికీ వర్షం వల్ల పూర్తికాక, ఇద్దరికీ ట్రోఫీని ఇచ్చేశారు.
భారత్ ఈ మ్యాచ్‌కు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సమూహ దశలో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వరుసగా ఏడు వన్డేలు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. పైగా, దుబాయ్ పిచ్‌కు భారత ఆటగాళ్లు పూర్తిగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌లో కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేశాడు.