ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైళ్లు ఉండడం పట్ల ఆయన తాజాగా అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫైళ్లు త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏ శాఖలో ఎన్ని పెండింగ్ ఫైళ్లు ఉన్నాయో, ఒక్కో ఫైలు పరిష్కారానికి సగటున ఎంత సమయం పడుతుందో చంద్రబాబు వివరించారు.
“జల వనరుల శాఖలో ఒక్కో ఫైలు పరిష్కారానికి సగటున 50 రోజులు పడుతోంది. హోంశాఖలో కీలక ఫైళ్ల క్లియరెన్స్ కు సగటున 47 రోజులు పడుతోంది. సీఎంవోలో ఒక్కో ఫైలు క్లియరెన్స్ కు 30 రోజుల సమయం పడుతోంది. ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ ఫైళ్ల పరిష్కారానికి సగటున 30 రోజుల సమయం పడుతోంది. ఫైళ్ల పరిష్కారం సగటు సమయం కార్మికశాఖలో 28 రోజులు, పాఠశాల విద్యాశాఖలో 26 రోజులు, ఆర్థిక, అటవీశాఖల్లో 9 రోజుల సమయం పడుతోంది.
రెవెన్యూ శాఖలో 11 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 14 వేల ఫైళ్లు… నీటిపారుదల శాఖలో 9 వేలు… హోంశాఖలో 7,400 ఫైళ్లు… సాధారణ పరిపాలన శాఖలో 12 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి” అని వివరించారు.
సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.