ఒక సినిమా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారడం అరుదు. దైనందిన సామాజిక జీవితంపై ప్రభావం చూపడం కూడా చాలా తక్కువ. చారిత్రక చిత్రం ‘ఛావా’ మహారాష్ట్ర రాజకీయాలు, ప్రజల జీవితాలపై అలాంటి ప్రభావం చూపిస్తోందా? అనే చర్చ మొదలైంది.
“ఔరంగజేబు సమాధిని ధ్వంసం చెయ్యాలి” అనే డిమాండ్, నాగ్‌పూర్ హింస లాంటి కొన్ని అంశాల వెనుక నేపథ్యం ఏమిటి?
ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఉదయించడం సహజమే అనిపించవచ్చు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మత సామరస్యాన్ని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.
అయితే రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా నాగ్‌పూర్ హింస గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ “నేను ఏ సినిమాను నిందించడం లేదు. ఛావా, ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి వాస్తవ గాధను మన ముందుకు తెచ్చింది. అది భారీ స్థాయిలో ప్రజల్లో భావోద్వేగాలను రగిలించింది. ఔరంగ జేబు మీద ఆగ్రహం బయటకు వస్తోంది” అన్నారు.
ప్రధాని మోదీ నుంచి మహారాష్ట్రలో గల్లీ నాయకుల వరకు అధికార పార్టీకి చెందిన నేతలంతా ఛావా సినిమాను ప్రస్తుతించడమే కాకుండా, ఆ చిత్రాన్ని చూడాలని ప్రజలకు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా టిక్కెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం కోసం ఇలాంటి చిత్రాలను నిర్మిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని సినిమా కథల్లో వాస్తవిక కోణం, వాటిని తెర మీద చూపడం వెనుక ఉద్దేశాల గురించి చర్చ మొదలైంది.
ఇలాంటి చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగా వస్తున్నాయి.
“కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది సబర్మతి ఎక్స్‌ప్రెస్” చిత్రాలు ఈ కోవకు చెందినవే.
ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రాలు పరంపరగా వస్తున్నాయి.
నాగ్‌పూర్‌లో హింసకు ముందే ‘ఔరంగజేబు సమాధి’ వార్తల్లో ఉంది.
ఛావా చిత్రంతోనే ఇది మొదలైంది. సినిమా విడుదల తర్వాత దాని తీవ్రత పెరిగింది.
ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయా?
సినిమాల ద్వారా చరిత్రను తెలుసుకోగలమా?
అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా, వాస్తవాలకు దూరంగా సినిమాలు నిర్మిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఎంత వరకు నిజం?చారిత్రక చిత్రాలను ఎలా అర్థం చేసుకోవాలనే అంశం గురించి నటుడు కులకర్ణితో బీబీసీ చర్చించింది.
“చారిత్రక చిత్రాలను అభినందించే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు.ఏదైనా కళ కారణంగా హింస, విధ్వంసం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అలా జరిగితే అది కళ కాదు. మరేదైనా కావచ్చు” అని కులకర్ణి బీబీసీతో చెప్పారు.
సినిమా, చరిత్రకున్న సరిహద్దుల గురించి దర్శకుడు వరుణ్ సుఖ్‌రాజ్ మాట్లాడుతూ
“చరిత్ర చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. అది సినిమాల ద్వారా అర్థం చేసుకునేది కాదు” అన్నారు.
“మీరొక కాలాన్ని అర్థం చేసుకోవాలంటే అది సినిమా ద్వారా సాధ్యం కాదు. ఫలానా మహారాజు కాలంలో జరిగిందంతా ఒక నిముషంలో అనే తరహా హైడ్‌లైన్లకు మనం అలవాటు పడిపోతున్నాం””మేము ఇంకా చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటిది ఒక సినిమా చూసి అదే చరిత్ర అని ఎలా చెబుతాం? చరిత్రలో ఇదే జరిగింది అని కచ్చితంగా ఎలా చెప్పగలం. చరిత్రను అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది. అలాంటి దాన్ని ఒక్క సినిమా ద్వారా అర్థం చేసుకోలేం””మనం చరిత్రను ‘చరిత్ర’ లానే చూస్తున్నామా?” అని ప్రశ్నించారు సీనియర్ ఫిల్మ్ స్కాలర్ శ్యామల వనరసే . ఆమె ‘ఛత్రపతి అభ్యాస్’ అనే పుస్తకం రాశారు.
“చరిత్రలో ప్రతి వ్యక్తికి అనేక కోణాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఇమేజ్‌ను మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బట్టే మీకు కావల్సిన కోణాన్ని ఎంచుకుంటారు. చారిత్రక చిత్రాలలో వ్యక్తులను చరిత్ర ప్రకారం సృష్టించడం లేదు. మీరు ఆ వ్యక్తిగురించి ఎలా ఆలోచిస్తున్నారో అలాగే సృష్టిస్తున్నారు. ప్రస్తుతం విడుదలవుతున్న చారిత్రక చిత్రాలు వాటిని నిర్మిస్తున్న వారి బుర్రలో ఎలాంటి చరిత్ర ఉందో తెలుపుతున్నాయే తప్ప నిజమైన చరిత్ర తెలియడంలేదు”టీవల మధ్య యుగం నాటి చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాల సంఖ్య పెరిగిందని నటుడు కిరణ్ మానే అన్నారు. వాటిని కూడా అధికారంలో ఉన్న వారుకోరుకుంటున్నట్లుగా, కథను తమకు అనుకూలంగా మార్చుకుని నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇలాంటి సినిమాల్లో ఒకటి రెండు వాస్తవ అంశాలు ఉంటే, పది, పదిహేను అంశాలను వక్రీకరిస్తున్నారని కిరణ్ మానే అభిప్రాయపడ్డారు.
“ప్రేక్షకులు రాజుల మీద ప్రేమతో ఈ చిత్రాలను ఆదరిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారు. నటుడు రణదీప్ హూడా సావర్కర్ గురించి సినిమా తీశారు. ఆ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలాగే కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా తీశారు. అది ఫ్లాప్ అయింది. మోదీ మీద తీసిన సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్రేక్షకులు రాజుల…