ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.
ఈ ఎదురు కాల్పుల్లో అనుమానిత మావోయిస్టులు 30 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అంశాన్ని పోలీసులు కొట్టిపారేయడం లేదు.
గత నెల 9న ఇదే ప్రాంతంలో 31 మంది అనుమానిత మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఏడాది జనవరి 20-21 మధ్యలో ఒడిశా సరిహద్దులో, జనవరి 16న తెలంగాణ బోర్డరులో 27 మంది అనుమానిత మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.
”ఈ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాంకేర్-నారాయణపూర్ జిల్లా సరిహద్దులో, దంతేవాడా-బీజాపూర్ సరిహద్దులో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఒక ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి 26 మంది మృతదేహాలను, మరో ఎన్‌కౌంటర్ ప్రాంతంలో నలుగురు మృతదేహాలను వెలికితీశాం.” అని గురువారం బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పీ చెప్పారు.
వేసవి కాలంలో సాధారణంగా మావోయిస్టులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటారని, కానీ, మావోయిస్టుల ప్రతి పథకాన్ని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయని సుందర్‌రాజ్ తెలిపారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా 2024లో చేపట్టిన వ్యూహాన్ని బస్తర్ పోలీసులు అమలు చేస్తున్నారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా సోషల్ మీడియాలో స్పందించారు.
”నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ మార్గంలో భాగంగా మన భద్రతా సిబ్బంది మరో అతిపెద్ద విజయాన్ని సాధించారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లో మన భద్రతా బలగాలు చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్స్‌లో పలువురు నక్సలైట్లు చనిపోయారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం నిర్దాక్షిణ్య వైఖరిని అనుసరిస్తోంది. లొంగిపోవడం నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం వరకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఎవరైతే లొంగిపోవడం లేదో ఆ నక్సలైట్లకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31నాటికి నక్సల్స్ రహిత భారత్‌ను చూస్తాం.” అని తెలిపారు.
భారత్ నుంచి మావోయిస్టులను పూర్తిగా తొలగించడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా 2026 మార్చి 31ను తుది గడువుగా నిర్ణయించారు. దీనికి ఇంకా ఒక్క ఏడాది మాత్రమే ఉంది.
దీంతో గత ఏడాది కాలంగా, ఛత్తీస్‌గఢ్‌లోని భద్రతా బలగాలు నిరంతరం మావోయిస్టులకు వ్యతిరేకంగా పలు ఆపరేషన్లను చేపడుతున్నాయి.
2024లో 223 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
ఈ ఏడాది అంటే 2025లో ఇప్పటి వరకు 93 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రస్తుతం చనిపోయిన వారి సంఖ్యతో కలిపితే మొత్తం 123 మంది.
గత 78 రోజుల డేటాను చూస్తే ప్రతి రెండు రోజులకు ముగ్గురు మావోయిస్టులు మరణించారు. అదేసమయంలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు.భద్రతా బలగాలకు, అనుమానిత మావోయిస్టులకు మధ్య జరుగుతున్న చాలా ఎన్‌కౌంటర్లపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనేక ఎన్‌కౌంటర్లు బూటకమని గిరిజనులు అంటున్నారు.
బస్తర్‌లో చాలామంది గిరిజనులు కూడా చనిపోతున్నారు. మావోయిస్టులను అణచివేశామని, మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. అయితే ఇన్ని ఎన్‌కౌంటర్ల మధ్య మావోయిస్టులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.