ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కావటంతో .. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా గేర్ మార్చారు. జిల్లాల పర్యటనల్లో ఆకస్మిక తనిఖీలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ పూర్తి కావటంతో.. కొత్త ఆర్దిక సంవత్సరం నుంచి పథకాల అమలు పై కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతి పై కీలక నిర్ణయాలకు ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీ కీలకంగా మారుతోంది. పలు నిర్ణయాలకు నేటి మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో కొత్త మార్పు చూపించేందుకు సిద్దమయ్యారు. ఇక నుంచి మంత్రులు తన అంచనాలకు తగినట్లుగా వేగంగా పని చేయాలని స్పష్టం చేయనున్నారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం తరువాత మధ్యాహ్నం క్యాబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. సీఆర్డీయే ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. దీంతో పాటుగా సీఆర్డీయే 22వేల 607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది.
సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. క్యాబినెట్ అమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సీఆర్డీఏ జారీ చేయనుంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేప ట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదించటం తో పాటుగా రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు అమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ ఎజెండాలకతో పాటుగా 4వ ఎస్ఐపిబి మీటింగ్ అమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించనుంది.
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట రూ.1,742 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులకు, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో రూ.25వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనలు.. ప్రభుత్వం – పార్టీ సమన్వయం పైన చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతోందని… ఈ సంస్కరణల్లో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ వన్ గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి వందేళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.
పేదరికం లేని సమాజం, టెక్నాలజీ, పీ4 వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచామని తెలిపారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండలాల వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. సచివాలయం యూనిట్ గా తీసుకుని ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రజలే ఆస్తిగా నియోజకవర్గాల ప్రోగ్రెసివ్ విజన్ రూపొందించామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. కుటుంబ జీవన ప్రమాణాలు పెరిగేలా ఆర్థిక స్వావలంబన దిశగా కృషి చేస్తున్నట్టు వివరించారు. చేపలు ఇవ్వడం కాదు… చేపలు పట్టేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యం, తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇల్లు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని అన్నారు. సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్ ఇలా అన్ని సౌకర్యాలు అందడమే లక్ష్యం అని వివరించారు.
రానున్న రోజుల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజి విద్యుదుత్పత్తి రంగాలు గేమ్ చేంజర్ లా మారతాయని స్పష్టం చేశారు. సంపద సృష్టికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పరిశ్రమలు తీసుకురావడమే బాధ్యతగా ఎమ్మెల్యేలు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం తరహాలో పరిశ్రమలను తరిమేయొద్దని అన్నారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని, ఇలాంటి సమయంలో దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. 1990లోనే సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకొచ్చామని, చెప్పిన దానికంటే ఎక్కవ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగిందని వెల్లడించారు.
ప్రధాని మోదీ వికసిత భారత్-2047ని అమలు చేస్తున్నారని, మనం స్వర్ణాంధ్ర విజన్-2047ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలను భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడమే లక్ష్యమని, తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందనుకున్నారని, కానీ రాయలసీమ రతనాల సీమగా మారడం ఖాయమని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అనంతపురం ఐదోస్థానానికి వచ్చిందని వివరించారు.