ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు.
ఆ భారీ ఆధ్యాత్మిక సదస్సులో ప్రపంచంలోని 58 దేశాల నుంచి వచ్చిన 1,581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో 15 వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. 60 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒకరోజు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 19న ఏపీ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు.
కాగా, ఇవాళ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా… ముంబయిలో టీటీడీకి స్థలం కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ముంబయిలో అమ్మవారి ఆలయం నిర్మాణం, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫడ్నవీస్ కు వినతి పత్రం అందించారు.
తిరుపతిలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు పర్యటిస్తున్నారు. తిరుపతిలో నేటి నుంచి మూడురోజుల పాటు టెంపుల్ ఎక్స్‌పో జరుగుతోంది. తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పోను ముగ్గురు సీఎంలు ప్రారంభిస్తున్నారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. సదస్సులో 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధుల హాజరుకానున్నారు. 111 మంది ప్రముఖ వక్తలు, 60 కిపైగా స్టాల్స్, 15 వర్క్ షాప్‌లను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడంపై మూడు రోజుల పాటు సదస్సు జరుగనుంది. మూడు గంటల నుంచి ప్రారంభం కానున్న సదస్సుకు ముఖ్యమంత్రులు హాజరుకానుండటంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.