భారీ అంచనాల మధ్య తలపెట్టిన భవిష్యత్ నగరి కార్యాచరణలో వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నవ నగరానికి బంగారు బాటలు వేసే కసరత్తులో వేగం పెంచి ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రివర్గం. మొత్తం 30 వేల ఎకరాల్లో కొలువుదీరనుందీ బృహత్తర ప్రాజెక్టు. 7 మండలాల్లోని 54 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిగా నిర్ణయించారు. నాగార్జునసాగర్- శ్రీశైలం రహదారి మధ్య రానున్న ఈ కొత్తనగరం తెలంగాణకు కొత్త గ్రోత్ ఇంజిన్ అవుతుందా? దీని విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం కలల ప్రాజెక్టుపై నిర్మాణరంగం ప్రతినిధులు, నిపుణుల అంచనాలు ఏం చెబుతున్నాయి?
హైదరాబాద్ మహానగరానికి మరో ఆణిముత్యాన్ని చేర్చేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డ్రీం ప్రాజెక్టును టేకప్ చేయటం తెలిసిందే. ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త నగరాన్ని డిజైన్ చేస్తున్న వేళ.. దీనికి సంబంధించిన ఒక కీలక జీవో తాజాగా విడుదలైంది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ పేరుతో కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అంతేకాదు రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిని డిసైడ్ చేశారు. ఈ అథారిటీకి ఛైర్మన్ గా ముఖ్యమంత్రి ఉండనున్నారు. పురపాలక.. పట్టణాభివ్రద్ధి శాఖ.. పరిశ్రమలు.. ఐటీ వాణిజ్య శాఖల మంత్రి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. పరిశ్రమలు.. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి.. పర్యావరణ.. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్.. టీజీఐఐసీ ఎండీ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. హైదరాబాద్ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
దీనికి సంబంధించిన ప్రత్యేక జీవోను పురపాలక.. పట్టణాభివ్రద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్ అవతల ఉన్న ప్రాంతాలు.. ముఖ్యంగా శ్రీశైలం నేషనల్ హైవే -నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ ఏరియా కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం డిసైడ్ చేసింది.
ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉండేవి. వాటిని ఎఫ్ సీడీఏకు బదిలీ చేశారు. మొత్తంగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి 7 మండలాలకు చెందిన 56 గ్రామాలను చేర్చారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.