గుజరాత్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) 84వ సమావేశం భారీ ఉత్సాహంతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గడ్డపై ఈ స్థాయి సమావేశం పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోదీని ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీతో పాటు దాదాపు 2000 మంది నేతలు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా సర్దార్ పటేల్‌ను బీజేపీ ఎలా ‘ఓన్’ చేసుకుందో, కాంగ్రెస్ నేతలు అదే ఉత్సాహంతో కాంగ్రెస్ వారసత్వాన్ని రీ కేమ్ చేశారు. “పటేల్, గాంధీ, నెహ్రూ వారసులు మేమే” అని మరోసారి బలంగా చెప్పారు. 30 ఏళ్లుగా గెలుపు చూడని గుజరాత్ నుంచే కొత్త ప్రణాళికను మొదలుపెడుతూ కాంగ్రెస్ నాయకత్వం మెరుగైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. జిల్లాల స్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
తాజా సమావేశంలో కీలకంగా రాష్ట్ర స్థాయి నాయకులకు కౌంటర్లు ఇచ్చారు. ఇకపై జిల్లా అధ్యక్షులకే పూర్తి అధికారాలు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షులు స్వయంగా అభ్యర్థుల ఎంపికలో పాల్గొనడం, నిధుల వాడకంపై ప్రత్యక్షంగా నియంత్రణ కలిగి ఉండేలా కొత్త వ్యవస్థను తెచ్చారు. అలాగే పార్టీ శిక్షణ, సోషల్ ఇంజినీరింగ్, ప్రచార విధానాలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ నేతలు పార్టీ పునరుజ్జీవనానికి బలమైన బాట వేసినట్టు కనిపిస్తోంది. బీజేపీని గుజరాత్ నుంచే నిలదీయాలని, పార్టీ అంతర్గతంగా సమగ్ర మార్పులు చేసి 2029 కేంద్ర ఎన్నికలలో పట్టు సాధించాలని చూస్తున్నారు. మరి ఈ సంకల్పం వాస్తవంగా మారి, కాంగ్రెస్ మళ్లీ పోటీలోకి వస్తుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్ కూడా మిగలలేదు.
అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే 1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.అయితే ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు, కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే కారణమని కాంగ్రెస్ పార్టీ మరో మారు గుర్తించింది.
ఈ నేపద్యంలో అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 – 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది.ముఖ్యంగా రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’ తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం… గుజరాత్ ను గెలవాలి!