* ఇద్దరు నిందితులు అరెస్టు
* రూ. 3 లక్షల నగదు, 3 వేటకొడవళ్లు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
* రూ. 23 లక్షల సుఫారీకి మాట్లాడి రూ. 3 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మిగితా రూ. 20 లక్షలు హత్యల తర్వాత చెల్లించేలా ఒప్పందం
అనంతపురం :
* జంట హత్యలు చేయడం కోసం కారు, 3 వేట కొడవళ్లు, రూ. 3 లక్షలు ముట్టజెప్పుతున్న సమయంలో ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భగ్నం చేసిన పోలీసులు
* జంట హత్యల కుట్రను భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
* జిల్లా ఎస్పీ ఆదేశాలు… కళ్యాణదుర్గం డీఎస్పీ సూచనలతో వివరాలు వెల్లడించిన రాయదుర్గం సి.ఐ
** అరెస్ట్ నిందితుల వివరాలు :
1) మురారి దామోదర్ గౌడ్, వయస్సు 47 సం., కేరేకొండాపుర (కే.కే.పుర) గ్రామం, మొలకాల్మురు తాలుకా, చిత్రదుర్గం జిల్లా, కర్ణాటక రాష్ట్రము
2) మూడుముళ్ళ మారుతి @ మారుతి రెడ్డి, వయస్సు 30 సంలు, మెచ్చిరి గ్రామం, రాయదుర్గం మండలం.
** నేపథ్యం :
ప్రస్తుతం అరెస్టయిన ఇద్దరిలో ప్రధాన నిందితుడైన మురారి దామోదర్ గౌడ్, మధుసూదన్ గౌడ్ లు అన్నదమ్ములు. వీరికి సుమారు రూ. 12 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. తన అన్న మధుసూదన్ గౌడ్ ను మరియు అతని కొడుకైన భార్గవ్ ను కడతేర్చితే రూ. 12 కోట్ల ఆస్తి తనకే దక్కుతుందని ఆశపడ్డాడు. సదరు ఆస్తి విషయంలో గత కొన్నేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వారం కిందట భార్గవ్ స్వయాన చిన్నాన్న అయిన దామోదర్ గౌడ్ ను స్వగ్రామంలోని వీధుల్లో చెప్పుతో కొట్టాడు. అవమానం ఒకవైపు… ఆస్తి దక్కించుకోవాలనే దురాశ వెరసి మధుసూదన్ గౌడ్ ను, భార్గవ్ ను కడతేర్చాలని భావించాడు.
** రూ. 23 లక్షల సుఫారీ కుదుర్చుకుని… అడ్వాన్సుగా రూ. 3 లక్షలు, మారణాయుధాలు సమకూర్చి
తన అన్న, అన్న కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో చంపాలని దామోదర్ గౌడ్ భావించి రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన మారుతీరెడ్డిని సంప్రదించాడు. ఈ మారుతీరెడ్డి గతంలో జరిగిన మెచ్చిరి ఆదికేశవులు హత్య కేసులో నిందితుడు కావడంతో అతనినీ ఆశ్రయించాడు. తండ్రీ, కొడుకులను కిడ్నాప్ చేసి హత్యే చేసేందుకు రూ. 23 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో రూ. 3 లక్షల నగదు అడ్వాన్స్ గా ఇవ్వడంతో పాటు హత్య చేసేందుకు అవసరమైన 3 వేట కొడవళ్లు సమకూర్చేలా మాట్లాడుకున్నారు. మిగితా రూ.20 లక్షలు కడతేర్చాక చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.
** రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని… జంట హత్యల కుట్ర భగ్నం చేసి
ఒప్పందం ప్రకారం రూ. 3 లక్షలు నగదు… కడతేర్చేందుకు వినియోగించే 3 వేటకొడవళ్లు మరియు కారులను మారుతీ రెడ్డికి దామోదర్ గౌడ్ ముట్టజెప్పేందుకు మెచ్చిరికి బయలుదేరాడు. ఈ సమాచారంరాయదుర్గం సి.ఐ జయనాయక్ కు రావడంతో జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో తన సిబ్బందితో కలిసి బృందంగా వెళ్లారు. రాయదుర్గం మండలం పల్లేపల్లి గేట్ వద్ద కారు, 3 వేట కొడవళ్లు, రూ. 3 లక్షల నగదును దామోదర్ గౌడ్ మెచ్చిరి మారుతీరెడ్డికి అందజేస్తుండగా ఈ పోలీసు బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జంట హత్యల కుట్రను భగ్నం చేశారు. అంతేకాకుండా వీరి నుండీ 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు.
* జిల్లా ఎస్పీ ప్రశంస : జంట హత్యల కుట్రను చాకచక్యంగా భగ్నం చేసిన రాయదుర్గం సి.ఐ జయనాయక్ మరియు ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు