కొందరికి భోజనంలో పెరుగుగానీ, మజ్జిగ గానీ లేకపోతే తిన్న తృప్తే ఉండదు. మన శరీరానికి మేలు చేసే ప్రొబయాటిక్స్ లో పెరుగు అత్యంత ఉత్తమమైనది. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే పెరుగు ఎక్కువగా తినడం వల్ల జలుబు చేస్తుందని, రాత్రి పూట అస్సలు తినవద్దని కొందరిలో నమ్మకాలు ఉన్నాయి. అయితే రోజూ పెరుగు తినడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులేమిటి, ఏమేం ప్రయోజనాలు ఉన్నాయనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
పెరుగు మన శరీరంలో రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుందని… తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవకుండా చూస్తుందని… రక్తంలో వేగంగా గ్లూకోజ్ నిల్వలు పెరిగే సమస్య ఉండదని వివరిస్తున్నారు.
పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి తోడ్పడతాయని నిపుణులు వివరిస్తునారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు… తరచూ పెరుగు తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ (ఎముకలు గుల్లబారడం) ప్రమాదం తక్కువగా ఉంటుంది.
జర్నల్ ఆఫ్ ఒబేసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం… తరచూ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో ఆకలి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా మరింత ఎదిగేందుకు, జీర్ణ శక్తి పెరిగేందుకు పెరుగు అత్యుత్తమ ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. తరచూ పెరుగు తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ‘ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)’ వంటి సమస్యలు దూరంగా ఉంటాయని వివరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం… నిత్యం పెరుగు తీసుకునే అలవాటు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా… మన రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీలను విడుదల చేసేందుకు, ఇమ్యూన్ కణాలను ఉత్తేజితం చేసేందుకు తోడ్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
పెరుగులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఇతర పదార్థాలు జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలోపేతమై వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుందని వివరిస్తున్నారు.
పెరుగు మన శరీరానికి ఎంతో మంచిది అయినా… కొందరికి పెరుగు పడకపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల పదార్థాలతో ఎలర్జీ ఉన్నవారికి కూడా దీనితో ఇబ్బంది ఉండవచ్చని అంటున్నారు. అందువల్ల పెరుగు తీసుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే… వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.