ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన కమలం పార్టీ.. ఈసారి విజయం దక్కించుకుంది. దీనికోసం ఓవైపు ఢిల్లీలో సోషల్ ఇంజినీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ధీటుగా మరిన్ని హామీలను బీజేపీ ప్రకటించింది.
2014 నుంచి వరుసగా మూడుసార్లు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇటీవలె వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ సొంతగా, మిత్రపక్షాలతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్రాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటోంది. అయితే 3 సార్లు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆ పార్టీకి అధికారం దక్కలేదు. కానీ తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా.. రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ దూకుడు మీదుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పడుతూ లేస్తూ ఉన్నారు. ఆయనకు అక్కడ బీజేపీ తరుపున ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గట్టి పోటీ ఇస్తున్నారు. అటు మరోవైపు కల్కాజీ స్థానంలో ఆతిషీ వెనకంజ వేసింది. మరోవైపు పత్ పర్ గంజ్ నుంచి ఆప్ అభ్యర్థి వెనకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిషీ మార్లెనా పై పోటీ చేసిన రమేశ్ బిధూరి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా రేసులో ఉన్నారు.
మరోవైపు కేజ్రీవాల్ కు న్యూ ఢిల్లీ స్థానం నుంచి చుక్కలు చూపిస్తూన్న పర్వేష్ సింగ్ వర్మ కూడా సీఎం రేసులో ముందున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్ దేవా పేరు కూడా రేసులో ఉంది. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా మనోజ్ తివారీ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ఉన్నారు. ఇక సిక్కు వర్గానికి చెందిన మజిందర్ సింగ్ సిర్సాతో కూడా రేసులో ఉన్నారు. లేకపోతే ఎవరికీ తెలియని నేతను అనూహ్యంగా ఎంపిక చేస్తారా అనేది చూడాలి.
మొత్తంగా ఎంపీగా ఉన్న మనోజ్ తివారీని సీఎంగా ఎంపిక చేయకపోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్ధుల్లో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ అనూహ్యంగా మహిళకు సీఎం అభ్యర్ధిగా ప్రకటించాల్సి వస్తే.. బాన్సురి స్వరాజ్, స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయి.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తరువాత దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
బీజేపీ అనూహ్య విజయాన్ని అందుకోగా.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా లాంటి నేతలు సైతం ఓటమి చవిచూశారు.
మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని బీజేపీ దక్కించుకుంది.
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రవేశ్ సాహిబ్ సింగ్, కేజ్రీవాల్ పై 4089 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
దిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి విజయం సాధించారు.
జనశక్తి ముఖ్యమని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని దిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా చెప్పారు. ఈ మహత్తరమైన, చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు దిల్లీ సోదర సోదరీమణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
దిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్ నిర్మాణంలో దేశరాజధాని ప్రధాన పాత్ర పోషించేలా చూడటంలో తాము ఏ మాత్రం వెనుకడుగు వేయబోమని హామీ ఇస్తున్నట్టు నరేంద్ర మోదీ ఆ పోస్టులో తెలిపారు.
న్యూదిల్లీలో కాంగ్రెస్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ చెప్పారు ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టులో ”నాకు అగ్రశ్రేణి నాయకత్వ బాధ్యతలు అప్పగించి, నాపై నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు” అని సందీప్ చెప్పారు.
”న్యూదిల్లీలో ఈ అవమానకరమైన ఓటమికి వ్యక్తిగతంగా నాదే బాధ్యత. దిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు.కానీ నేను దానిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాను” అని చెప్పారు.
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సందీప్ దీక్షిత్‌కు కేవలం 4568 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గెలిచారు. ఆయన ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై 4089 ఓట్ల తేడాతో గెలిచారు.
అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.
రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకూ ప్రజాక్షేత్రంలో ఓటమనేదే ఎరుగలేదు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రికార్డు చెదిరిపోయింది. పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోనే ఉన్న దేశరాజధాని పగ్గాలను ఇప్పుడు కమలం పార్టీ లాగేసుకుంది. అంతే కాదు.. కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయాలకూ అడ్డుకట్ట వేసింది. గత రెండు పర్యాయాలు భారీ మెజార్టీ కట్టబెట్టి ఢిల్లీ పీఠంపై కూర్చోపెట్టిన ఓటర్లు ఈ సారి కనికరించలేదు. కేజ్రీవాల్ గ్యారెంటీలపై నమ్మకం ఉంచేందుకు సాహసించలేదు. భారతీయ జనతా పార్టీ వల్లే తమ రాత మారుతుందని పూర్తిగా నమ్మారు. దారుణ ఓటమి అంటే ఎలా ఉంటుందో చీపురు పార్టీకి తొలిసారి రుచి చూపించారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దారుణ పరాజయంపై స్పందించారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రకటన ద్వారా తొలిసారిగా స్పందించారు. ‘ ప్రజల ఆదేశాన్ని మేము శిరసావహిస్తాం. పూర్తి వినయంతో అంగీకరిస్తున్నాం. ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి నా అభినందనలు. వారిని ఎన్నుకున్న ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రజల కోసం ఎన్నో చేశాం. ఆరోగ్యం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఈ తీర్పును గౌరవంగా భావిస్తాం. ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తాం. అలాగే ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేస్తూ వారి వెన్నంటే ఉంటాం. అలాగే ఎన్నికల్లో పోరాడిన ప్రతి ఒక్క ఆప్ పార్టీ నేతకు, కార్యకర్తకు కూడా నా ధన్యవాదాలు’. అని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ ‘వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేసింది. అవినీతి మరకలు, కుంభకోణాలు ఆప్ పార్టీ పాలిట శాపంగా మారాయి. న్యూ ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, జంగ్‌పురా నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓడిపోగా.. సీఎం ఆతిషీ ఒక్కరే గెలిచారు. 2015లో 70కి 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలిచి భారీ మెజార్టీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి కనీసం పాతిక స్థానాలు కూడా నిలబెట్టుకోలేకపోయింది.