‘‘డ్రిల్, బేబీ, డ్రిల్’’ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన నినాదం ఇది.అమెరికన్ చమురు కంపెనీలు ఎక్కువ చమురు ఉత్పత్తి చేయాలి, చమురు ధరలు తగ్గాలి అన్నది ఈ నినాదం వెనక ట్రంప్ లక్ష్యం.కానీ ట్రంప్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఈ నినాదానికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం సుంకం విధించాలని డోనల్డ్ ట్రంప్ నిర్ణయించారు.ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రయోజనం పొందే అవకాశం ఉండవచ్చేమో కానీ, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయేమోనన్న ఆందోళన నెలకొంది.
ట్రంప్ నిర్ణయం భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలపై ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉంది.ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనిజ్వెలా పూర్తిగా ఖండించింది.ఇది అక్రమమని, నిస్పృహతో కూడుకున్నది అని ఆరోపించింది.ట్రంప్ నిర్ణయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజ్వెలాలో ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ఉత్పత్తినే వెన్నెముకగా భావిస్తారు.”అమెరికాకు, మేం మద్దతు ఇచ్చిన స్వేచ్ఛకు వెనిజ్వెలా చాలా విరుద్ధంగా ఉంది. అందుకే, వెనిజ్వెలా నుంచి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే ఏ దేశం అయినా మా దేశంతో జరిపే వాణిజ్యంపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలూ సిద్ధం చేస్తాం. ఏప్రిల్ 2, 2025న అమెరికా విముక్తి దినోత్సవం నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తుంది” అని ట్రంప్ తన పోస్టులో తెలిపారు.
అక్రమ వలసలపై అమెరికా, వెనిజ్వెలా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో ట్రంప్ ప్రకటన వెలువడింది. ట్రంప్ తన పోస్ట్‌లో అక్రమ వలసల అంశాన్ని కూడా ప్రస్తావించారు.”వెనిజ్వెలా ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా పదివేల మంది తీవ్రమైన నేరస్థులను అమెరికాకు పంపింది. వారిలో చాలామంది హంతకులు, చాలా హింసాత్మక స్వభావం గల వ్యక్తులు. అమెరికా పంపిన ముఠాల్లో ట్రెన్ డీ అరగువా ఒకటి. దీనిని ”విదేశీ ఉగ్రవాద సంస్థ”గా గుర్తించారు. మేం వారిని వెనిజ్వెలాకు తిరిగి పంపే ప్రక్రియలో ఉన్నాం” అని ట్రంప్ చెప్పారు.
దక్షిణ అమెరికా దేశమైన వెనిజ్వెలాలో చమురు సంపద ఎక్కువగా ఉంది. ఆ దేశాన్ని రష్యాకు మద్దతుదారుగా భావిస్తారు. వెనిజ్వెలాలోని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించడం లేదు.ట్రంప్ నిర్ణయాన్ని వెనిజ్వెలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను అమెరికా తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.”నిస్పృహతో కూడిన ఈ అక్రమమైన, ఏకపక్ష చర్య మా దేశానికి వ్యతిరేకంగా విధించిన అన్ని రకాల ఆంక్షల వైఫల్యాలను తెలియజేస్తోంది” అని వెనిజ్వెలా విదేశాంగ మంత్రి ఇవాన్ ఖీల్ ఒక ప్రకటనలో చెప్పారు.
”వెనిజ్వెలాతో చమురు, గ్యాస్ వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన నిర్ణయాన్ని వెనిజ్వెలా తీవ్రంగా ఖండిస్తోంది. వెనిజ్వెలా ప్రజలు తిరస్కరించిన ఫాసిస్ట్ మితవాదం, దేశాన్ని తమ ముందు మోకరిల్లేలా చేస్తుందన్న ఆశతో ఏళ్లుగా ఆర్థిక ఆంక్షలను ప్రోత్సహించింది. కానీ వారు (అమెరికా) విఫలమయ్యారు” అని ఆ ప్రకటనలో తెలిపారు.తమ హక్కుల గురించి అంతర్జాతీయ సంస్థల ముందు మాట్లాడడానికి, ఆర్థిక నిబంధనల కొత్త ఉల్లంఘనలు గురించి చెప్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసకుంటామని వెనిజ్వెలా చెప్పింది.
వెనిజ్వెలా చమురు దిగుమతిని కనీసం ఒక సంవత్సరం పాటు ఆపే వరకు సుంకాలు అమలులో ఉంటాయని, వాటిని అంతకన్నా ముందుగానే రద్దు చేసే హక్కు అమెరికాకు ఉందని ట్రంప్ అధికారయంత్రాంగం ఇచ్చిన ఉత్తర్వులో ఉంది.అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్. తన అవసరాల కోసం భారత్ 80 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉంది.
రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, నైజీరియా వంటి దేశాల నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తోంది.2018 ఎన్నికల్లో నికోలస్ మదురో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు అమెరికా 2019లో వెనిజ్వెలాపై కఠినమైన ఆంక్షలు విధించింది.అమెరికా ఆంక్షల కారణంగా చమురు ఎగుమతి చేయకుండా వెనిజ్వెలా ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్‌ఏ నిషేధానికి గురయింది.
భారత్ అధికారిక వాణిజ్య డేటా ప్రకారం, 2019లో మనదేశానికి ఐదవ అతిపెద్ద చమురు సరఫరాదారు వెనిజ్వెలా. భారత శుద్ధి కర్మాగారాలకు 16 మిలియన్ టన్నుల ముడి చమురును సరఫరా చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ శుద్ధి కర్మాగారాల వాటా ఎక్కువ.అయితే, భారత్ ప్రస్తుత చమురు దిగుమతుల్లో వెనిజ్వెలా వాటా రోజుకు 4.5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఉంది. ఇది గతంలో కంటే చాలా తక్కువ.
ఈ ఏడాది జనవరిలో భారత్ రోజుకు 65,000 బ్యారెళ్ల వెనిజులా ముడి చమురును, ఫిబ్రవరిలో రోజుకు 93,000 బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఒక బ్యారెల్‌లో దాదాపు 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది.ఈ నిర్ణయం చాలా వింతగా ఉందని, అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తోందని ఇంధన విధానం, భౌగోళిక రాజకీయాల నిపుణులు నరేంద్ర తనేజా అన్నారు. ”భారత్ ఇప్పుడు వెనిజ్వెలా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయడం లేదు. భారతదేశం తన మొత్తం చమురులో 1.7 శాతం మాత్రమే వెనిజ్వెలా నుంచి కొంటోంది. అది కూడా ఒక ప్రైవేట్ శుద్ధి కర్మాగారం ద్వారా దిగుమతి అవుతోంది. అమెరికా తన ప్రయోజనాల కోసం భారత్ వంటి మిత్రదేశాలను ఇబ్బందుల్లోకి నెడుతోంది. మీరే నిరంతరం వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు ఇతర దేశాలపై ఎందుకు ఇలాంటి సుంకాలను విధిస్తున్నారు” అని నరేంద్ర తనేజా ప్రశ్నించారు.
ట్రంప్ ప్రకటన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతం పెరిగాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 73 డాలర్లకు, డబ్ల్యుటీఐ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 69.11 డాలర్లకు చేరుకుంది.”ఈ సుంకాల యుద్ధం కొనసాగితే, చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, రెండో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు. ఇలాంటి పరిస్థితిలో, చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, భారత్ వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది” అని నరేంద్ర తనేజా అన్నారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటే, వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి పదే పదే చెబుతున్నారు.అంతర్జాతీయ చమురు మార్కెట్లో హెచ్చుతగ్గుల దృష్ట్యా, భారత్ తన సరఫరాదారుల నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరిలో వెనిజ్వెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌ను హర్దీప్ సింగ్ పురి కలిశారు. భారతీయ కంపెనీలు వెనిజ్వెలాలో దాదాపు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయని ఆ సమయంలో సోషల్ మీడియా ఎక్స్‌లో హర్దీప్ సింగ్ పురి చెప్పారు.దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని కొనసాగించడం, పరస్పర ప్రయోజనాలు, ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించడంపై సమావేశంలో చర్చించారు.డెల్సీ రోడ్రిగ్జ్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ పర్యటనకు వచ్చారు. మన దేశంతో ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంచుకోవడంపై చర్చించారువెనిజ్వెలాతో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం భారతదేశానికి మంచిదని నరేంద్ర తనేజా అభిప్రాయపడ్డారు.”వెనిజ్వెలాతో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం మనకు మంచిది. ఆ దేశానికి భారీ చమురు నిల్వలున్నాయి. వెనిజ్వెలాలో చమురు ఎక్కువగా ఉంది. దానిని శుద్ధి చేయడంలో భారత్ శుద్ధి కర్మాగారాలు ముందున్నాయి. భారతదేశం రాబోయే అనేక దశాబ్దాలపాటు చమురు దిగుమతులపై ఆధారపడాలి. కాబట్టి మనం మనకోసం వీలైనన్ని ఎక్కువ అవకాశాలను సిద్ధంగా ఉంచుకోవాలి” అని తనేజా చెప్పారు.మరోవైపు దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఐదు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. ట్రంప్ సుంకాలు అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు ఈ పర్యటన నిర్ధారణ అయింది. ఈ సమయంలో ఆయన వాణిజ్య, సుంకాల అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నారు.