అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ముగ్గురు భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి(AP CM) హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan Kalyan) ఆర్థికసాయం ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పెనువిషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో భక్తులు తప్పించుకునే పరిస్ధితి లేకపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రేపు శివరాత్రి కావడంతో భక్తులు గుండాలకోన ఆలయ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మరో ఇద్దరిని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు వై.కోట వాసులుగా తెలుస్తోంది. అటవీ మార్గం కావడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సిఎం ప్రకటించారు.
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తుల మృతిపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు.