క్వీన్ కంగన రనౌత్ నిరంతర వివాదాల గురించి తెలిసిందే. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కంగన స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది. కంగనకు చెందిన మణికర్ణిక ఫిలింస్, ఎమర్జెన్సీని స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ కు ప్రముఖ జర్నలిస్ట్- రచయిత్రి కుమీ కపూర్ లీగల్ నోటీస్ పంపారు. తన పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కోసం నిబంధనల్ని పట్టించుకోకుండా, తప్పుల తడకగా సినిమాని రూపొందించి తన ప్రతిష్ఠను మంట కలిపారని రచయిత్రి కుమీ ఆరోపించారు.
కంగన, ఆమె సోదరుడు అక్షత్ తన పుస్తకం `ది ఎమర్జెన్సీ`లోని ఒక అధ్యాయాన్ని సినిమాకి ఉపయోగించుకుంటామని అడిగారని, పుస్తకం ప్రచురించిన పెంగ్విన్ తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారని రచయిత తెలిపారు. కానీ స్క్రిప్టు రచయిత తన పుస్తకాన్ని ఒక్కసారి చదివినా ఇలాంటి తప్పులు చేసి ఉండేవారు కాదని, చారిత్రక తప్పిదాలు సినిమాలో ఉన్నాయని ఆరోపించారు. ఈ నెల ఆరంభమే నోటీసులు పంపించినా వారు స్పందించలేదని రచయిత్రి అన్నారు. ఒప్పందంలో కీలక నిబంధనల్ని ఉల్లంఘించారని వ్యాఖ్యానించారు.
రాత పూర్వక అనుమతి లేకుండా ప్రచారం లేదా ప్రమోషన్ చేయకూడదని నిబంధన ఒప్పందంలో ఉందని రచయిత్రి తెలిపారు. ఎమర్జెన్సీ కూమి కపూర్ రచన ది ఎమర్జెన్సీ, జైయంత్ వసంత్ షిండే రచన ప్రియదర్శని నుండి ప్రేరణ పొంది రూపొందించామని డిస్ క్లెయిమర్`ని నెట్ ఫ్లిక్స్ ఉపయోగించుకుందని తెలిపారు. కూమి కపూర్ రాసిన `ది ఎమర్జెన్సీ పుస్తకాన్ని 2015లో పెంగ్విన్ ప్రచురించింది.1975-77 ఎమర్జెన్సీ కాలంపై కుమీ ఈ పుస్తకాన్ని రాసారు. నోటీసులకు కంగన ఇంకా స్పందించాల్సి ఉంది.
కంగన స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎమర్జెన్సీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాని పూర్తి చేసేందుకు తన ఆస్తులను కూడా తనఖా పెట్టినట్టు కంగన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత ముంబైలోని ఆ ఆస్తిని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. ఎమర్జెన్సీని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కంగన రాజకీయంగాను తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.