ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 205 మంది భారతీయులకు చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే మనోళ్ల సంఖ్య మరో ఐదు పెరిగింది. భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 9,250 కోట్ల డాల ర్ల (సుమారు రూ.7.91 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలో ఆయనే నం.1 కాగా ప్రపంచ లిస్ట్‌లో మాత్రం 18వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 5,630 కోట్ల డాలర్ల (రూ.4.81 లక్షల కోట్లు) ఆస్తితో దేశంలో రెండో అత్యంత ధనికుడిగా ఉన్నారు. ప్రపంచ జాబితాలో ఆయనకు 28వ స్థానం దక్కింది. జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 3,550 కోట్ల డాలర్ల (రూ.3.04 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో ఉన్నారు. అంతేకాదు, దేశంలో ఆమే అత్యంత సంపన్న మహిళ కూడా. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సావిత్రి జిందాల్ 48వ స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ (3,450 కోట్ల డాలర్లు), సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ (2,490 కోట్ల డాలర్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్, డీమార్ట్ సూపర్ మార్కెట్ల అధిపతి రాధాకిషన్ దమానీ, డీఎల్‌ఎ్‌ఫకు చెందిన కేపీ సింగ్ వరుసగా టాప్-10లోని మిగతా స్థానాలను దక్కించుకున్నారు.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలోని 205 మంది భారతీయుల మొత్తం సంపద 94,100 కోట్ల డాలర్లుగా (రూ.80.46 లక్షల కోట్లు) నమోదైంది. గత ఏడాది జాబితాలోని 200 మంది బిలియనీర్ల మొత్తం సంపద 95,400 కోట్ల డాలర్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. గడిచిన ఏడాదిలో అంబానీ, అదానీల ఆస్తి భారీగా తరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల్లో అమెరికా (902 మంది), చైనా (516 మంది) తర్వాత మూడో స్థానం మనదే. ప్రపంచ బిలియనీర్లలో సగానికిపైగా ఈ మూడు దేశాల్లోనే ఉండటం గమనార్హం.
భారత బిలియనీర్లలో 13 మంది తెలుగు వారు కూడా ఉన్నారు. అందులో దివీస్ ల్యాబ్స్ చైర్మన్ మురళి దివి 910 కోట్ల డాలర్ల (సుమారు రూ.77,805 కోట్లు) సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. హెటిరో గ్రూప్ అధిపతి పార్థసారధి రెడ్డి 380 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు చెందిన మహిమ దాట్ల 320 కోట్ల డాలర్ల ఆస్తితో తెలుగు రాష్ట్రాల్లోని సంపన్న మహిళగా నిలిచారు. తెలుగువారులో అత్యధికం ఫార్మా రంగానికి చెందినవారే కావడం విశేషం.
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఈసారి 3,028 మందికి చోటు దక్కింది. వీరి సంఖ్య 3,000 దాటడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోలిస్తే 247 మంది పెరిగారు. ఈ ఏడాది జాబితాలోని బిలియనీర్ల మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి మొత్తం 16.1 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,377 లక్షల కోట్లు) చేరుకుంది.
ర్యాంక్ (బి. డాలర్లు)
323 మురళి దివి 9.1 దివీస్ లేబొరేటరీస్
948 బీ పార్థసారధి రెడ్డి 3.8 హెటిరో గ్రూప్
1141 మహిమ దాట్ల 3.2 బీ ఈ లిమిటెడ్
1219 జీఎం రావు 3 జీఎంఆర్ గ్రూప్
1265 ప్రతాప్ సీ రెడ్డి 2.9 అపోలో హాస్పిటల్స్
1305 పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 2.8 అరబిందో ఫార్మా
1408 ఎం సత్యనారాయణ రెడ్డి 2.6 ఎంఎ్‌సఎన్ గ్రూప్
1513 జూపల్లి రామేశ్వర్ రావు 2.4 మై హోమ్ గ్రూప్
1688 పీ పిచ్చి రెడ్డి 2.1 మేఘా ఇంజనీరింగ్
1688 పీవీ కృష్ణా రెడ్డి 2.1 మేఘా ఇంజనీరింగ్
2233 జీవీ ప్రసాద్ 1.5 డాక్టర్ రెడ్డీస్
2233 కే సతీశ్ రెడ్డి 1.5 డాక్టర్ రెడ్డీస్
2479 సుబ్బమ్మ జాస్తి 1.3 సువెన్ లైఫ్