ఓ బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 43 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మాలి దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ గని కొందరు చైనా జాతీయులు నిర్వహణలో ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు.
కొన్ని రోజుల వ్యవధిలోనే మాలి దేశంలో జరిగిన రెండో ప్రమాదం ఇది. గత నెల 29న కౌలికోరో ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కూలిపోయిన ఘటనలోనూ ప్రాణనష్టం జరిగింది.
మాలి దేశం ఆఫ్రికాలోని మూడో అతి పెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది గనులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. గతేడాది కూడా మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి 70 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడి గనుల్లో చాలా వరకు అనుమతులు లేనివే ఉంటాయని తెలుస్తోంది.