కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లకుపైగా ఉంటుందని పోలీసుల అంచనా. తులం బంగారం(Gold) ధర లక్షకు చేరువైన తరుణంలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్ రోడ్డులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు(Proddatur) నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న కారును తనిఖీ చేయగా… అందులో బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు. అయితే ఈ బంగారు ఆభరణాలకు సంబంధించి వారి వద్ద ఎటువంటి రశీసుదులు, బిల్లులు మరియు ఇతర పత్రాలు లేకపోవడంతో… ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు… వాటిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయపన్ను శాఖ, రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటి విలువను లెక్కించారు. అవన్నీ హైదరాబాద్ లోని ఓ బంగారం దుకాణానికి చెందినవిగా గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటు లభించిన బిల్లులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ సందర్భంగా కారులో బంగారాన్ని లెక్కించగా… 18 కేజీల ఉన్నట్లు లెక్క తేలింది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ బంగారం హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణానికి చెందినదని వారు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బంగారానికి సంబంధించిన రసీదుల గురించి వారు ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియ జేశారు. ఈ నేపథ్యంలో బంగారం నగల దుకాణం వారితో పోలీసులు మాట్లాడుతూన్నారు. బిల్లు ఉన్నాయా? లేదా అంటూ బంగారం దుకాణం యజమానులను ప్రశ్నిస్తున్నారు.