టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు కొత్త ఫీచర్ అందించనుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారికి గూగుల్ మెసేజెస్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు గూగుల్ తీసుకువస్తున్న ఫీచర్ ఏంటంటే… గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు.
గూగుల్ మెసేజెస్ యాప్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ పైభాగంలో కుడివైపున వీడియో కాల్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ ను క్లిక్ చేస్తే చాలు… నేరుగా వాట్సాప్ వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ సదరు యూజర్ ఫోన్ లో వాట్సాప్ లేకపోతే, గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్ చేసుకోవచ్చు.
గూగుల్ త్వరలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ వాట్సాప్ వీడియో కాల్ ఒక వ్యక్తితో మాత్రమే మాట్లాడుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి గ్రూప్ కాలింగ్ సాధ్యం కాదు. మున్ముందు గ్రూప్ కాలింగ్ చేసుకునేలా ఈ ఫీచర్ ను గూగుల్ అప్ డేట్ చేయనుంది.