దేశంలో టోల్ వసూలు వ్యవస్థ త్వరలోనే ఒక పెద్ద మార్పును చూడబోతోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) చెల్లింపు విధానం పూర్తిగా ఆటోమేటెడ్ జీపీఎస్ (GPS) ఆధారిత వ్యవస్థతో భర్తీ కానుంది. ఈ కొత్త విధానం భారతదేశ రోడ్డు మౌలిక సదుపాయాలను అప్ డేట్ చేసేందుకు, టోల్ వసూలు ప్రక్రియలో ఉన్న లోటుపాట్లను తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 15 రోజుల్లో కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ మే నెల నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు.
జీపీఎస్ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, టోల్ ట్యాక్స్ వసూలు చేసే భౌతిక బూత్‌లు తొలగిపోతాయి. టోల్ ఛార్జీలు వాహన యజమానుల బ్యాంకు ఖాతాల నుండి నేరుగా, శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్, నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. జీపీఎస్ ఆధారిత ట్యాక్స్ వసూలు ప్రధాన లక్ష్యం టోల్ బూత్‌లను పూర్తిగా తొలగించడం, మౌలిక సదుపాయాలను తగ్గించడం, మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించడం. దీనితో పాటు, టోల్ బూత్‌ల వద్ద ఉండే పొడవైన క్యూల వల్ల ఏర్పడే ఆలస్యాన్ని కూడా నివారించవచ్చు.
“కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, టోల్ గురించి ఎవరూ ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండదు” అని గడ్కరీ అన్నారు. కొత్త వ్యవస్థ GNSS (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) ను ఉపయోగించి టోల్ రోడ్లపై వాహనం ప్రయాణించిన దూరాన్ని పర్యవేక్షిస్తుంది. రోడ్లపై అమర్చిన ప్రత్యేక కెమెరాలు వాహనాల ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ను స్కాన్ చేస్తాయి. దాని ప్రకారం టోల్ ఛార్జీలు విధిస్తారు. ఈ సమూల మార్పు 2016 లో ప్రారంభించిన ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థకు అధికారికంగా ముగింపు పలుకుతుంది.
కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి, మోసాలు లేదా దుర్వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. భారతదేశ రోడ్డు నెట్‌వర్క్ వేగవంతమైన వృద్ధి టోల్ ప్లాజాల సంఖ్యను పెంచింది. మౌలిక సదుపాయాల వ్యయాలను పెంచింది. టోల్ బూత్‌లు రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లకు కూడా కారణమయ్యాయి. రియల్-టైమ్ ట్రాకింగ్, ఆటోమేటిక్ డిడక్షన్ మరింత పారదర్శకతను తీసుకురానుంది. ఎందుకంటే టోల్ రోడ్లపై ప్రయాణించిన దూరం మేరకు మాత్రమే ఛార్జీలు విధించబడతాయి. ముంబై-గోవా హైవే ప్రాజెక్ట్ గురించి గడ్కరీ మాట్లాడుతూ.. అనేక ఆలస్యాలను ఎదుర్కొన్న ఈ రహదారి ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిగా పూర్తవుతుందని తెలిపారు.