ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో నడిచే టూ-వీలర్లను పూర్తిగా నిషేధించేందుకు సిద్ధమవుతోంది. తాజా ముసాయిదా ఎలక్ట్రిక్ వాహనాల విధానం 2.0 ప్రకారం, శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను నగర రోడ్లపై అనుమతించబోరు. ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ విధానం ఏప్రిల్ 15 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ విధానం కేవలం టూ-వీలర్లకే పరిమితం కాదు. ప్రైవేట్ కార్ల కొనుగోలుదారులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇద్దరు రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నవారు మూడవది కొనాలనుకుంటే, అది తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనమై ఉండాలి. పరిశ్రమ గణాంకాల ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2025లో దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 26.2 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో 3శాతం వాహనాలు ఢిల్లీలోనే విక్రయించబడ్డాయి.
అమ్మకమైన 15.9 మిలియన్ టూ-వీలర్లలో 2శాతం ఢిల్లీకి చెందిన వినియోగదారులు కొనుగోలు చేశారు. కార్ల విభాగంలో ఆ ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 4.1 మిలియన్ ప్యాసింజర్ కార్లలో ఢిల్లీ వాటా 5శాతం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఢిల్లీ ముందుంది. మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో 12శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. అయితే, ఈ విషయంలో త్రీ-వీలర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. వాటిలో 53శాతం ఎలక్ట్రిక్ వాహనాలే. టూ-వీలర్లు, కార్లు వరుసగా 6శాతం, 4శాతంతో వెనుకబడి ఉన్నాయి.
ఈ విధానంలో భాగంగా ఆగస్టు 15, 2025 నుండి కొత్త సీఎన్‌జీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్‌ను కూడా నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, పరిశ్రమ నిపుణులు ఈ విధానం అమలులో అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాల్లో ఎక్కువ భాగం ఢిల్లీ సరిహద్దుల్లోని ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ వంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) నగరాల్లో రిజిస్టర్ చేయబడి ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ నగరాలు ఢిల్లీ నగర పరిధిలోకి రావు. ఇన్ని అమలుపరమైన సవాళ్ల మధ్య, ఢిల్లీ అధికారులు వాయు కాలుష్యాన్ని తగ్గించగలరా అనేది వేచి చూడాలి.