హంద్రీనీవా రాయలసీమకు జీవనాడి.
• బడ్జెట్లో అత్యధికంగా 3040 కోట్లు కేటాయింపు.
• ఈ ఏడాది జూన్ కల్లా నీరు ఇవ్వాలని కృత నిశ్చయం.
700 కిలోమీటర్లు పొడవు, దాదాపు 70 కు పైగా లిఫ్టులతో, రాయలసీమలోని కర్నూలు అనంతపూర్,కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే బృహత్తర హంద్రీనీవా ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హంద్రీనీవా రెండో దశ పనులకు సంబందించి ఇప్పటికే టెండర్లు అప్పగించి పనులు వేగవంతం చేశామని తెలిపారు. ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. వచ్చే జూన్ కల్లా పూర్తి చేసి నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి సామర్ద్యం 3850 క్యూసెక్కులు ఉంటే, మాల్యాల పంప్ హౌస్ నుండి జీడిపల్లి పంప్ హౌస్ దగ్గరకు కేవలం 1200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని, అదే ప్రధాన కాలువ లైనింగ్, విస్తరణ పనులు పూర్తైతే ప్రస్తుతం ఉన్న దానికి రెట్టింపుగా 2200 క్యూసెక్కుల నీరు జీడిపల్లి రిజర్వాయర్ కు చేరుకుంటుందని స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలువల లైనింగ్ పనులకు సంబందించి కొంత మంది కావాలని, లేనిపోని అపోహాలు కల్పిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రగతినిరోధకుల మాటలు పట్టించుకోవద్దని రాయలసీమ రైతాంగానికి హితువుపలికారు. హంద్రీనీవా ప్రధాన కాలువకు ఆనుకుని ఉన్న అన్ని నియోజకవర్గాల్లో చెరువులు, ఉపకాల్వల ద్వారా కృష్ణాజలాలతో నింపుతామని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులు కూడా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులకు అనుసంధానం చేసి పూర్తి చేస్తామని చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలోని చివరి ఎకరం వరకు సాగు నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులపై పలు మార్లు సమీక్షలు నిర్వహించి, వెంటనే పనులు మొదలుపెట్టేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈబడ్జెట్ లో రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులకంటే, అత్యధికంగా 3040 కోట్ల రూపాయాల నిధులు కేటాయించి ఈ ప్రాంతం అభివృద్దిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. 2019-24 గత వైసిపి ప్రభుత్వ హాయాంలో హంద్రీనీవా పనుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్దితి ఉందని, కనీసం కరెంటు ఛార్జీలు కూడా చెల్లించలేదని ఎద్దేవా చేశారు.ఇప్పటికే హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వచ్చే సీజన్ నాటికి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని వివరించారు.