బాలీవుడ్‌లో చావా సినిమాపై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఎంత ప్రశంసలు అందుకుంటుందో, ఔరంగజేబు క్రూరత్వాన్ని ప్రేక్షకులు అంతే స్థాయిలో తిట్టుకుంటున్నారు. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా అందించిన పరిణతి చెందిన నటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడో రొమాంటిక్ హీరోగా కనిపించిన అక్షయ్, పూర్తిగా భిన్నమైన గెటప్‌లో, కఠినమైన మనస్తత్వంతో మెప్పించాడని అంటున్నారు.
ఇక ఈ క్రేజ్ మన హరి హర వీరమల్లుకు ఎలా వర్తిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో కూడా ఔరంగజేబు పాత్ర ఉంది. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చావాలోని ఔరంగజేబు పాత్రను చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు వీరమల్లులో అతనిని ఎలా చూపించారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ముఖ్యంగా, ఉత్తరాదిలో ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఔరంగజేబు పాత్రను నెమ్మదిగా, మృదువుగా చూపిస్తే విమర్శలు రావొచ్చు.
ఇప్పటికే బాబీ డియోల్ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయినట్టు సమాచారం. హరి హర వీరమల్లు కథలో మొఘల్ సామ్రాజ్యానికి పవన్ కళ్యాణ్ పోటీగా ఎలా నిలబడ్డాడనేదే ప్రధానమైన అంశం. అయితే, చావాలో అతని పాత్ర సినిమా మొత్తం సాగినట్టుగా కాకుండా, వీరమల్లులో ఔరంగజేబు తక్కువ స్క్రీన్ స్పేస్‌లో కనిపించే అవకాశాలున్నాయి. అయినా, ఈ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నదే ఆసక్తికరంగా మారింది.
సినిమా నిర్మాణ బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే విడుదల తేదీగా మార్చి 28 అనౌన్స్ చేశారు. అయితే, షూటింగ్ ఆలస్యం కావడం, కొత్తగా వచ్చే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉండటంతో, ఫైనల్ అవుట్‌పుట్ ఎప్పటికీ సిద్ధమవుతుందనేది ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో హరి హర వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ హిస్టారికల్ మూవీ, ప్రమోషన్ పక్కాగా జరిగితే, విడుదల నాటికి మళ్లీ చర్చనీయాంశం అవ్వడం ఖాయం.