Donald Trump: అమెరికాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గల హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. యూదులపై ద్వేషాన్ని (యాంటీ సెమిటిజం) అరికట్టడంలో విఫలమైందన్న ఆరోపణలతో, అమెరికా ప్రభుత్వం హార్వర్డ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్‌కు ఇవ్వాల్సిన 2.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.18,300 కోట్లు) ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న 60 మిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులూ రద్దు చేశారు.
విద్యార్థుల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు స్వతంత్ర పరిశీలన జరిపించాలి, వివాదాస్పదమైన డైవర్సిటీ కార్యాలయాలను మూసేయాలి, విదేశీ విద్యార్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలన్నవి ట్రంప్ ప్రభుత్వ ప్రధాన డిమాండ్లు. కానీ, హార్వర్డ్ యాజమాన్యం మాత్రం వీటిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి తమ స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. తమకు రాజ్యాంగ హక్కులు ఉన్నాయని, ఎవరు అధ్యాపకులుగా ఉండాలో, ఏం బోధించాలో ప్రభుత్వం నిర్ణయించలేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ స్పష్టం చేశారు.
ఇప్పటికే కొలంబియా విశ్వవిద్యాలయానికి 400 మిలియన్ డాలర్ల నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు హార్వర్డ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ కొలంబియా యాజమాన్యం ప్రభుత్వ సూచనల్ని స్వీకరించగా, హార్వర్డ్ మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదంటూ మొండి వైఖరి తీసుకుంది. విద్యాసంస్థల స్వేచ్ఛను పరిరక్షించాలా? లేక ప్రభుత్వ నియంత్రణకు లోబడాలా? అనే చర్చ దేశవ్యాప్తంగా మళ్లీ మొదలైంది.
ఈ వ్యవహారంతో అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల పాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వేచ్ఛ పేరుతో హార్వర్డ్ చేస్తున్న వ్యవహారమేనా సరైందన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలపై ప్రభుత్వ జోక్యం ఎంతవరకు అవసరమన్న దానిపై వివాదం ముదురుతోంది.