ఓడిపోయిన పార్టీని గాడిలో పెట్టాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ మొత్తం ఒక్కసారిగా డీమోరలిజ్ అయింది. దాంతో గడచిన పది నెలల కాలంలో పార్టీలో పెద్దగా చురుకుదనం కనిపించడం లేదు.అడపాదడపా చిన్నపాటి నిరసనలు తప్ప వైసీపీ మొత్తం స్తబ్దుగా ఉంది. మరో వైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో పనిచేసుకుని పోతోంది. అమరావతి రాజధాని పోలవరం వంటివి కూటమి ప్రయారిటీలుగా ముందుంచి పనిచేస్తోంది. ఈ రెండింటిలో సక్సెస్ అయితే తిరుగు ఉండదని భావిస్తోంది.
ఇక సంక్షేమ పధకాల విషయంలో ఆల్స్యంగానైనా సరే జనాలకు అందించి మార్కులు అందుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వద్ద ఎన్నో మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. సో వైసీపీ వరకూ చూస్తే అభివృద్ధి అజెండా ఏమిటో ఇప్పటిదాకా వెల్లడించలేదు. సంక్షేమ పధకాలు అమలు చేయలేదని మాత్రమే అంటోంది. మాట్లాడితే సూపర్ సిక్స్ ఏవీ సూపర్ సెవెన్ ఏవీ అని అంటోంది అయితే ఈ పరిమితమైన అజెండాతో వైసీపీ కూటమి సర్కార్ ని ఢీ కొట్టలేదు అన్నది అంతా అంటున్న మాట. అదే సమయంలో జనసేన బీజేపీలతో కలసి టీడీపీ కూటమి బలంగా మారిన వేళ రాజకీయ ఆర్ధిక సామాజిక పరంగా ఎన్నో అంశాలలో కూటమి అత్యంత పటిష్టంగా ఉంది.
గడచిన పది నెలల కాలంలో వైసీపీకి కూటమి పెద్దగా చాన్స్ అయితే ఇవ్వలేదు. దాంతో నిరాశలోనే విపక్షంలోని వైసీపీ తొలి ఏడాది గడవబోతోందా అన్న చర్చ కూడా ఉంది. ఒక వైపు పార్టీలో సీనియర్లను విముఖులను సుముఖులుగా చేసే కార్యర్కమాన్ని వైసీపీ అధినాయకత్వం చేపట్టింది. అలాగే జిల్లాల అధ్యక్షులను నియోజకవర్గాల ఇంచార్జిలను పార్టీ నియమిస్తూ పోతోంది. అనేక కీలక పదవులు భర్తీ చేస్తోంది. అయితే పదవులు అందుకున్న వారు అంతా పెద్దగా యాక్టివ్ కాకపోవడం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఒకటికి పదిసార్లు జనంలో ఉండమని చెబుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మాటకు వస్తే జనంలోకి వెళ్ళేందుకు బలమైన ప్రజా వ్యతిరేక అంశం కూడా లేకుండా పోయింది అని అంటున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్టీకి సరైన దిశా నిర్దేశం చేసే వ్యూహకర్తలు కావాల్సి ఉందని అంటున్నారు. వైసీపీ 2019లో ప్రశాంత్ కిశోర్ సేవలను అందుకుంది. 2024 నాటికి ఆయన బృందంలోని రిషి సేవలను తీసుకుంది. ఇక ఇపుడు చూస్తే వైసీపీకి ప్రత్యేకంగా వ్యూహకర్తల టీం అయితే లేదు అనే అంటున్నారు. పైగా పీకే టీం కానీ ఐప్యాక్ తో కానీ వైసీపీ కంటిన్యూ కాకూడదనే నిర్ణయించుకుందని చెబుతున్నారు. దాంతో వైసీపీ చూపు జాతీయ స్థాయి వైపుగా మళ్ళిందని అంటున్నారు. జాతీయ స్థాయిలో పేరు మోసిన వ్యూహకర్తలు అనేక మంది ఉన్నారు. వారి సంస్థలు కూడా ఉన్నాయి. దాంతో వారితో టచ్ లోకి వైసీపీ వెళ్ళింది అని అంటున్నారు.
రానున్న రోజులో జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉండి సక్సెస్ రేటు కలిగిన వారిని తెచ్చి వ్యూహకర్తలుగా నియమించుకోవడమా లేక వారి సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ పార్టీని నడపడమా అన్న దాని మీద వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ కొత్త రకం పోరాటలకు మార్గం దొరుకుతుంది. అంతే కాదు కూటమి ప్రభుత్వం మీద సరికొత్త పంధాలో జనంలో వ్యతిరేకతను పెంచేందుకు కూడా ఆయుధాలు సమకూరుతాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహాల లేమితో సతమతమవుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.