విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.కంచె గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండటంతో అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం..దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.ముందుగా అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు.ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పట్నుంచి అక్కడే కొనసాగుతోంది. అయితే, ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందట మొదలైంది.2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది.అప్పట్లో ప్రభుత్వం 850 ఎకరాలు ఇవ్వగా, అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ దీన్ని వినియోగించాలనేది లక్ష్యం.
2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి భూముల బదలాయింపు జరిగింది.ఐఎంజీ అకాడమీ నిర్దేశిత సమయంలో ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది.దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది.ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ నిరుడు మే నెలలో పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది.ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) గతేడాది జూన్ 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది”టీజీఐఐసీ చేసిన విజ్జప్తి మేరకు ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు చేశాం.” అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం.”యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జులై 19న యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేసి హద్దులు నిర్ధరించారు.” అని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, భూములకు హద్దులు నిర్ణయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసీ చెప్పిన విషయంలో వాస్తవం లేదని యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.”ఇప్పటివరకు భూములకు హద్దులు నిర్ధరించలేదు. ఆ విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేయలేదు. ప్రభుత్వానికి విజ్జప్తి చేసిన విధంగా పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలి.” అని యూనివర్సిటీ మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో కోరింది.ఈ మొత్తం వ్యవహారంపై యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ మాట్లాడారు.”2003లో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని, గోపన్‌పల్లి వైపు కొంత భూమిని ఇచ్చింది. అలా ఇచ్చిన భూమిని కూడా తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలకు కేటాయించింది.” అని అన్నారు.
అలాగే, అప్పట్లో ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి వర్సిటీ ఆధీనంలోకే భూములు వస్తాయని ఆయన వివరించారు.”2006లో రాష్ట్ర ప్రభుత్వంపై ఐఎంజీ అకాడమీ హైకోర్టు వెళ్లింది. ఆ సమయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు. దానివల్ల ఆ భూములు ప్రభుత్వానివేనని, ప్రభుత్వమే పోరాడుతోందన్నట్లుగా మారిపోయింది.”తాము పనులు చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని చెబుతోంది టీజీఐఐసీ.”మష్రూం రాక్స్‌తో పాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను ఉన్నట్లుగా గుర్తించాం. వాటిని హరిత స్థలాలుగా (గ్రీన్ స్పేస్) పరిరక్షిస్తాం.” అని టీజీఐఐసీ చెబుతోంది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని, ఇప్పుడు ఉన్న జలవనరులు (లేక్స్), రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను దెబ్బతీయడం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది.”మేం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా ముట్టుకోలేదు. నేను అదే యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అక్కడే చదువుకున్నారు. యూనివర్సిటీ భూములను రక్షించే బాధ్యత మాపై ఉంది.” అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు.ఈ విషయంపై అసెంబ్లీలో మార్చి 25వ తేదీన రేవంత్ రెడ్డి మాట్లాడారు.”25 సంవత్సరాల నుంచి ఏ రోజూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆ భూమి లేదు. డెవలప్‌మెంట్ కోసం భూమిని టీజీఐఐసీకి కేటాయించి ఐటీ కంపెనీలు రావాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రూపొందించాం.” అని చెప్పారు.అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా టీజీఐఐసీ ద్వారా బహిరంగ వేలం వేసి భూములు విక్రయిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.”పారదర్శకంగా భూముల విక్రయాలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు.” అని రేవంత్ రెడ్డి అన్నారు.ఆ భూముల్లో జింకలు, పులులు, సింహాలు ఉన్నట్లుగా చెబుతున్నారని, అక్కడ గుంట నక్కలు చేరి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.