ఆధార్‌తో ఓటరు కార్డులను అనుసంధానించాలని ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన సాంకేతిక పనులను కమిషన్ మొదలుపెట్టనుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి యూఐడీఏఐ సీఈఓ, కేంద్ర హోం కార్యదర్శితో సమావేశం నిర్వహించారు .
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండా ఓటరు కార్డులోని ఎపిక్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.ఆధార్ కార్డు ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధరిస్తుంది.
“కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్లు 23 (4), 23 (5), 23 (6) WP (సివిల్) నం. 177/2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. ఎపిక్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించడం సాధ్యమే” అని కమిషన్ పేర్కొంది.దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా స్పందించింది.ఈ ప్రక్రియలో ఏ ఓటరు పేరునూ వదిలిపెట్టకుండా ఎన్నికల సంఘం చూడాలని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి అని కోరింది.
2024 లోక్‌సభ ఎన్నికల డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 97 కోట్ల 97 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 91 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
2024 ఎన్నికల్లో 64 కోట్ల 64 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు . 2019 ఎన్నికల్లో ఈ సంఖ్య 61.4 కోట్లుగా ఉంది.యూఐడీఏఐ ప్రకారం , సెప్టెంబర్ 2023 నాటికి, భారతదేశంలో 138 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి.ఆధార్‌ను ఓటరు కార్డుకు రెండు విధాలుగా లింక్ చేయవచ్చని భావిస్తున్నారు.నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ ద్వారా మీ ఖాతాను తెరచి ఎవరికివారుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం. ఈ విధానంలో పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, మీ పేరు, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి.ఒకవేళ మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోయినా ఆధార్ కాపీని అప్‌లోడ్ చేసి లింక్ చేయడం మరో పద్ధతి.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి “ఎన్నికల కమిషన్ కొత్తగా ఏమీ చెప్పడం లేదు” అని అన్నారు. 2010లో, నేను సీఈసీగా ఉన్న సమయంలోనే, ఈ ప్రక్రియ మొదలైంది.” అన్నారు.
“తర్వాత యూఐడీఏఐ సీఈఓ నందన్ నీలేకనితో అనేకసార్లు సమావేశాలు జరిగాయి. బయోమెట్రిక్స్ ద్వారా గోవాలో కూడా ఒక ప్రయోగం జరిగింది.”తరువాత సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. కోర్టు స్టే ఎత్తివేసినప్పుడు, రెండవ సీఈసీ పదవిలో ఉన్నారు. ఆ సమయంలో కోటి మందికి పైగా వ్యక్తులు లింక్ చేశారు. కానీ కోర్టు మళ్లీ దానిపై స్టే విధించింది.తమను తాము లింక్ చేసుకోలేని వారి కోసం, ఎన్నికల కమిషన్ బీఎల్ఓఏ ఇంటింటికీ వెళ్లి ఈ పనిని పూర్తి చెయ్యచ్చని ఖురేషి చెప్పారు.
“ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానిస్తే బోగస్ ఓటింగ్‌ను అరికట్టవచ్చు, ఒకే వ్యక్తి పేరు చాలా చోట్ల నమోదు కాకుండా చూడొచ్చు” అని ఆయన అన్నారు.ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం 66 కోట్ల మంది ఆధార్ డేటా ఉంది, వారు స్వచ్ఛందంగా డేటాను అందించారు. అయితే, వీటిని ఇంకా లింక్ చేయలేదు. డేటాను లింక్ చేయడానికి ఎన్నికల సంఘం యూఐడీఏఐతో కలిసి పనిచేస్తుంది అని తెలిపారు.న్యాయ మంత్రిత్వ శాఖ ఫారమ్ 6బీ ని సవరిస్తుంది, దీనిలో ఆధార్ వివరాలు స్వచ్ఛందంగా ఉన్నాయో లేదో పేర్కొనవలసి ఉంటుంది. ఒకవేళ లేకపోతే, ఎందుకు లేవో తగిన కారణం కూడా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.”ఈ మొత్తం ప్రక్రియలో ఎటువంటి సమస్యా ఉండదు, ఎందుకంటే దీనివల్ల పెద్ద పెద్ద పనులు కూడా సులువుగా పూర్తయ్యాయి” అని ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ చెప్పారు.”ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ ఆధార్ కార్డు లేని వారు ఏం చేయాలి? వారి గురించి ఎన్నికల కమిషన్ ఏం చెబుతుంది, లేదా ఆధార్ కార్డు పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి ఓటరుగా మారగలడా?” అని ఆయన అన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారించారు.ఏప్రిల్ 30, 2025 నాటికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంస్కరణల కోసం ఎన్నికల సంఘం సూచనలను కోరింది.దీనితో పాటు, కమిషన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశాలను నిర్వహిస్తోంది.ఈ సమావేశాలలో రాజకీయ పార్టీల ఆందోళనలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ఎన్నికల ప్రక్రియలో నమ్మకం,పారదర్శకత కొనసాగుతుంది.ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
“ఓటర్ల జాబితాలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఈ చర్య ద్వారా ఎన్నికల కమిషన్ అంగీకరించినట్టేనని” ప్రకటనలో పేర్కొంది.”2024లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. అందుకే ” మహారాష్ట్ర అసెంబ్లీ ,లోక్‌సభ ఎన్నికల పూర్తి ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ముందుగానే చూపించాలని మేం డిమాండ్ చేస్తూనే ఉన్నాం.”మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లోనే కొత్త ఓటర్ల నమోదులో అసాధారణ పెరుగుదల ఉందన్నది ప్రధాన ఆరోపణ. అంటే ఒకే వ్యక్తి పేరుతో చాలా ఓటరు ఐడీలు ఉన్నాయని అర్థం” అని ప్రకటనలో పేర్కొంది.ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవడానికి రక్షణ చర్యలతో కూడిన సృజనాత్మక పరిష్కారాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని కూడా ఆ ప్రకటన పేర్కొంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చివరి క్షణంలో ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు చేర్చారన్నారు.లోక్‌సభలో బడ్జెట్ సమావేశాల్లో ఓటర్ల జాబితా అంశంపై మాట్లాడారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా, ‘నకిలీ ఓటర్ల’ అంశంపై కూడా లోక్‌సభలో చర్చ జరగాలని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగతా రాయ్ కూడా డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.మార్చి 11న దిల్లీలో పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి, అధికార తృణమూల్ కాంగ్రెస్ నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చిందని ఆరోపించారు.అలాగే అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాపై దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.